కొన్నేళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పుడు అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నిరంతరం కొనసాగే హింస ప్రజలకు నరకాన్ని చూపించింది. అటువంటి సమయంలో ఆఫ్ఘన్ ప్రజలకు సంతోషాన్ని ఇచ్చేది ఒక్క క్రికెట్ మాత్రమేనని, వారి కోసమే తాము ఆడుతున్నామని స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గతంలో పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు రషీద్ ఖాన్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. ‘రషీద్ ఖాన్: ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్డమ్’ అనే పుస్తకంలో ఈ వివరాలను పొందుపరిచారు.
నా దేశం కోసం ఆడలేకపోతే.. ఇంకెవరికీ ఆడను: రషీద్ ఖాన్ మహమ్మద్ హంద్ జాఫర్ రాసిన ఈ పుస్తకంలో రషీద్ ఖాన్ స్వయంగా ఈ ఉదంతాన్ని వివరించాడు. భారత్ మరియు ఆస్ట్రేలియా దేశాలు తనకు పౌరసత్వం ఇచ్చి, తమ జట్ల తరపున ఆడమని కోరినట్లు తెలిపాడు. దీనిపై స్పందిస్తూ, “ఒకవేళ నేను నా సొంత దేశం కోసం ఆడలేకపోతే, ప్రపంచంలోని మరే ఇతర దేశం కోసం క్రికెట్ ఆడను” అని రషీద్ స్పష్టం చేశాడు.
BCCI సీనియర్ అధికారి నుంచి ఆఫర్ 2023 ఐపీఎల్ సీజన్ సమయంలో బీసీసీఐకి చెందిన ఒక సీనియర్ అధికారి తనను కలవాలని కోరినట్లు రషీద్ ఈ పుస్తకంలో పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్లోని గడ్డు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌లోనే ఉండిపోవాలని ఆయన సూచించారట. “మీ దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, మీరు భారత్‌కు వచ్చేయండి. మీకు కావాల్సిన అన్ని అధికారిక పత్రాలను మేమే అందిస్తాం. ఇక్కడే ఉండి క్రికెట్ ఆడండి” అని ఆఫర్ ఇచ్చినట్లు రషీద్ వెల్లడించాడు.
దేశంపై ఉన్న ప్రేమను చాటుకున్న రషీద్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆఫర్ గురించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు కానీ, భారత అధికారి ఇచ్చిన ఆఫర్‌ను మాత్రం రషీద్ సున్నితంగా తిరస్కరించాడు. ఆ సమయంలో తాను కొంతసేపు ఆశ్చర్యపోయానని, కానీ తన దేశం పట్ల విధేయతకే మొగ్గు చూపానని రషీద్ పేర్కొన్నాడు.
