IRCTC E-Pantry Service: భారతీయ రైల్వే ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ‘ఈ-పాంట్రీ’ (e-Pantry) సేవలను ప్రారంభించింది. దీని ద్వారా 25 ప్రధాన మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికులు ఆన్లైన్లో ఆహారం, నీటిని ఆర్డర్ చేయవచ్చు. అవి నేరుగా వారి సీటు వద్దకే డెలివరీ చేయబడతాయి.
టికెట్ ధరలో భోజన ఖర్చులు చేర్చని రైళ్ల కోసం ఈ సదుపాయం ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఈ-పాంట్రీ సర్వీస్ అంటే ఏమిటి? ప్రయాణికులు ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలి?
ఈ-పాంట్రీ సేవలు IRCTC వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు తమకు నచ్చిన స్టాండర్డ్ మీల్స్ మరియు ‘రైల్ నీర్’ (ప్యాకేజ్డ్ వాటర్)ను టికెట్ బుక్ చేసుకునే సమయంలో లేదా ఆ తర్వాత “Book Ticket History” సెక్షన్లోకి వెళ్లి ఆర్డర్ చేయవచ్చు.
ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత, ప్రయాణికులకు SMS లేదా ఈమెయిల్ ద్వారా మీల్ వెరిఫికేషన్ కోడ్ (MVC) వస్తుంది. ప్రయాణ సమయంలో, రైలులోని వెండర్కు ఈ MVCని చూపించడం ద్వారా ఆర్డర్ చేసిన భోజనాన్ని నేరుగా మీ సీటు వద్దే పొందవచ్చు.
ఈ సేవలు ఎవరికి అందుబాటులో ఉంటాయి?
- కన్ఫర్మ్, RAC లేదా పాక్షికంగా (partially) కన్ఫర్మ్ అయిన టికెట్లు ఉన్న ప్రయాణికులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
- ప్యాంట్రీ కార్ సౌకర్యం లేని రైళ్లలో ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
- ప్రయాణికులకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
ఏ ఏ రైళ్లలో ఈ సదుపాయం ఉంది?
మొదట ఈ పైలట్ ప్రాజెక్ట్ను భారతదేశంలో అతి పొడవైన రైలు మార్గాల్లో ఒకటైన వివేక్ ఎక్స్ప్రెస్ (22503/04) లో విజయవంతంగా పరీక్షించారు. దీనికి వచ్చిన సానుకూల స్పందనతో ఇప్పుడు 25 ప్రధాన రైళ్లకు విస్తరించారు. వాటిలో కొన్ని:
- స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్
- స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్
- కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్
- మంగళా లక్షద్వీప్ ఎక్స్ప్రెస్
- కళింగ ఉత్కల్ ఎక్స్ప్రెస్
- పుష్పక్ ఎక్స్ప్రెస్
- పశ్చిమ ఎక్స్ప్రెస్
- గ్రాండ్ ట్రంక్ (GT) ఎక్స్ప్రెస్
- పురుషోత్తం ఎక్స్ప్రెస్.. మరియు మరిన్ని.
ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
దీని వల్ల ప్రయాణికులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే పరిశుభ్రమైన ఆహారాన్ని నేరుగా తమ సీటు వద్దే పొందవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేయడం ఈ సేవ వెనుక ఉన్న లక్ష్యం.
ఇతర రైళ్లలో కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయా?
ప్రయాణికుల స్పందన మరియు అవసరాలను బట్టి భవిష్యత్తులో మరిన్ని రైళ్లలో ఈ ఈ-పాంట్రీ సేవలను విస్తరించనున్నట్లు IRCTC స్పష్టం చేసింది.
