సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులను బంధించిన ఒక జైలు నుండి రిపోర్టింగ్ చేసిన తన అనుభవాలను మలయాళ జర్నలిస్ట్ అంజనా శంకర్ పంచుకున్నారు. యూఏఈ (UAE) కేంద్రంగా పనిచేస్తున్న స్వతంత్ర పాత్రికేయురాలు అంజన, ఆ జైలు సందర్శనలో తాను చూసిన భీకర దృశ్యాలను గుర్తుచేసుకున్నారు.
అంజనా శంకర్ కథనం ప్రకారం: “ఆరేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున, నేను ఈశాన్య సిరియాలోని కుర్దిష్ నియంత్రణలో ఉన్న ఒక జైలు నుండి రిపోర్ట్ చేశాను. అక్కడ వేలాది మంది ISIS ఉగ్రవాదులను బంధించారు. 2019 నుండి వీరంతా ఇదే జైలులో మగ్గుతున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ఐసిస్‌లో చేరడానికి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు.
ఒక చిన్న గదిలో వందలాది మందిని కిక్కిరిసి బంధించారు. చేపలను బుట్టలో పేర్చినట్లుగా వారు అక్కడ పడి ఉన్నారు. కనీసం గాలి ఆడే సౌకర్యం కూడా లేదు. కేవలం ఆహారం లోపలికి పంపడానికి ఒక చిన్న రంధ్రం మాత్రమే ఉంది. ఏళ్ల తరబడి వారు ఇలాగే బతుకుతున్నారు. జైలులోని ఒక హాల్లో అనారోగ్యంతో ఉన్న ఉగ్రవాదులను ఉంచారు. వారిలో కాళ్లు, చేతులు తెగిపోయిన వారు కూడా ఉన్నారు. ఎవరితోనూ కంటి చూపు (Eye contact) కలపకుండా వేగంగా నడుస్తూ వీడియో తీసుకునేందుకు నాకు అనుమతి లభించింది. నా చుట్టూ తుపాకులు పట్టుకున్న ఐదారుగురు సైనికులు నిరంతరం కాపలా ఉన్నారు.
అక్కడున్న వారంతా తమ ముఖాలను కప్పుకుని ఉన్నారు. నా దగ్గర కనీసం స్కార్ఫ్ కూడా లేకపోవడంతో నేను ముఖం దాచుకోలేకపోయాను. లోపల చాలా భయమేసింది, ఊపిరి బిగబట్టి అక్కడ నడిచాను. వీరు ఎన్నోసార్లు జైలు గోడలు బద్దలు కొట్టి తప్పించుకోవాలని చూశారు. ఐసిస్ పూర్తిగా అంతం కాలేదు. బయట ఉన్న ఐసిస్ ‘స్లీపర్ సెల్స్’ ఇప్పటికీ ఈ జైళ్లను ధ్వంసం చేసి ఖైదీలను విడిపించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దీనివల్ల వారికి యుద్ధం చేయడానికి మరికొంత మంది సైనికులు దొరుకుతారనేది వారి ప్లాన్.
చాలా దేశాలు తమ పౌరులైన ఈ ఉగ్రవాదులను తిరిగి తీసుకెళ్లడానికి ఇష్టపడటం లేదు. దీంతో వీరంతా కుర్దిష్ సైన్యానికే భారంగా మారారు. అయితే, ఈ జైళ్లకు కాపలా కాసేంత ధనం కానీ, సైన్యం కానీ కుర్దిష్ దళాల వద్ద లేదు అన్నది వాస్తవం. ప్రస్తుతం సిరియాలో పరిస్థితులు మారుతున్నాయి. సిరియన్ నేషనల్ ఆర్మీ ఈ జైళ్ల బాధ్యతను తీసుకుంటుందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.”
