కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ హైలైట్‌గా నిలిచింది. సూపర్ ఓవర్లో సునీల్ నరైన్ తన అనుభవాన్ని రంగరించి కేవలం 3 బంతుల్లోనే లక్నోను 1 పరుగుకే కట్టడి చేసి 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత రింకూ సింగ్ పని పూర్తి చేసి కేకేఆర్ కు విజయాన్ని అందించాడు. అయితే, అసలు మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లాల్సిన అవసరమే ఉండేది కాదు. అంపైర్ చేసిన ఒక పొరపాటు వల్ల మ్యాచ్ టై అయ్యింది.
అంపైర్ చేసిన ఆ ఘోర తప్పిదం ఏమిటి? లక్నో ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్తీక్ త్యాగి బౌలింగ్‌కు రాగా, క్రీజులో రిషబ్ పంత్, నికోలస్ పూరన్ ఉన్నారు. మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ బాధ్యత తీసుకుని ఆకట్టుకునేలా ఆడుతున్నాడు. 12వ ఓవర్ మొదటి బంతికే పంత్ ‘షార్ట్ ఫైన్ లెగ్’ మీదుగా ఒక అద్భుతమైన షాట్ కొట్టాడు. ఆ బంతి స్పష్టంగా బౌండరీ లైన్ వెలుపల పడింది. కానీ, అంపైర్ దానిని సిక్సర్‌గా కాకుండా ఫోర్‌గా ప్రకటించాడు.
ఎవరూ గమనించలేదు: బంతి బౌండరీ లైన్ అవతల పడినట్లు టీవీ రీప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా, అంపైర్ మాత్రం ఫోర్ ఇచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ తప్పును ఫీల్డర్లు కానీ, బ్యాటర్ రిషబ్ పంత్ కానీ వెంటనే గమనించలేకపోయారు. ఆట యథావిధిగా కొనసాగింది. అయితే మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ వరకు వెళ్లడంతో, ఆ 2 పరుగులు లక్నోకు ఎంత కీలకమో ఇప్పుడు అర్థమవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో: రిషబ్ పంత్ ఆ షాట్ కొట్టిన సమయంలో డీజే బ్రావో బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్‌తో మాట్లాడుతున్నాడు. అందరి దృష్టి అంపైర్ సిగ్నల్ మీద లేకపోవడంతో ఈ పొరపాటు జరిగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తుపానులా వైరల్ అవుతోంది. అంపైర్ల నాణ్యతపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
