KKR vs LSG: కోల్‌కతాను ఆదుకున్న రింకూ సింగ్; తండ్రిని స్మరించుకుంటూ కన్నీరు పెట్టుకున్న ప్రియా సరోజ్!

కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మరోసారి తనేంటో నిరూపించుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో కేకేఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరి పోరాటం చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో రింకూను ఉత్సాహపరిచేందుకు అతని కాబోయే భార్య (Fiancée) ప్రియా సరోజ్ స్టేడియానికి వచ్చారు.

మామగారిని తలుచుకుని భావోద్వేగం: కేకేఆర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ప్రియా సరోజ్ మాట్లాడుతూ.. “రింకూ ఆడిన తీరు చూసి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజు ఆయన ఆడిన ఈ ఇన్నింగ్స్ మా మామగారికి (రింకూ తండ్రి) అంకితం. ఈ సమయంలో మేము ఆయన్ని చాలా మిస్ అవుతున్నాం” అని ఎమోషనల్ అయ్యారు.

రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్, టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతున్న సమయంలో ఫిబ్రవరి 27న కన్నుమూశారు. ఆయన నాలుగో దశ లివర్ క్యాన్సర్‌తో పోరాడి తుది శ్వాస విడిచారు.

రింకూ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్: ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 51 బంతుల్లోనే 5 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఒక దశలో తక్కువ స్కోరుకే పరిమితమవుతుందనుకున్న కేకేఆర్‌ను తన హిట్టింగ్‌తో 155 పరుగుల వద్ద నిలిపారు. అనంతరం మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీయగా, అక్కడ కూడా రింకూ ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు. అద్భుత ప్రదర్శన చేసిన రింకూకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.


Posted

in

by

Tags: