LSG vs KKR: తలకిందులైన పంత్ వ్యూహం; నికోలస్ పూరన్‌పై నమ్మకం పెట్టినందుకు భారీ మూల్యం!

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలో ఆ జట్టు ఈ సీజన్‌లో ఆరో ఓటమిని మూటగట్టుకుంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వరకు వెళ్లిన లక్నో, చివరకు ఓటమి పాలు కావడంతో పంత్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ముఖ్యంగా ఫామ్‌లో లేని నికోలస్ పూరన్‌ను సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు పంపడం లక్నో కొంపముంచింది.

పంత్ ఏమన్నారంటే? మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ.. జట్టుపై ఒత్తిడి పెరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. “మాకు ప్రస్తుతం ఒక బ్రేక్ అవసరం. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది, కానీ సమాధానాలు మనలోనే వెతుక్కోవాలి. ప్రతి ఆటగాడు బాధ్యత తీసుకోవాలి. ఇది కేవలం ఒకరిద్దరి విషయం కాదు, మొత్తం జట్టు సమిష్టిగా రాణించాలి” అని పేర్కొన్నారు.

పూరన్‌ను పంపడంపై వివరణ: నికోలస్ పూరన్‌ను సూపర్ ఓవర్‌లో పంపడంపై వస్తున్న విమర్శలకు పంత్ స్పందిస్తూ.. “మేము గ్రూపులో చర్చించుకున్నప్పుడు నిక్కీ పీ (పూరన్) పేరు వచ్చింది. అతను అత్యుత్తమ ఫామ్‌లో లేకపోయినా, క్లిష్ట పరిస్థితుల్లో మన ఆటగాడిపై నమ్మకం ఉంచాలి. అతను ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. ఇది సాకు కాదు, ప్రస్తుతానికి ఫలితం ప్రతికూలంగా ఉన్నా బ్రేక్ తర్వాత సానుకూల మార్పు వస్తుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

అభిమానుల ఆగ్రహం: నికోలస్ పూరన్ ఐపీఎల్ 2026లో వరుసగా విఫలమవుతున్నా, అతనిపై పంత్ అతిగా నమ్మకం ఉంచడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో పంత్ వ్యాఖ్యలను “కుంటి సాకులు” అని కొట్టిపారేస్తున్నారు. అలాగే చివరి ఓవర్‌ను దిగ్వేష్ రాఠీకి ఇవ్వడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయాలనే ఉద్దేశంతోనే రాఠీని వాడానని, అయితే అది వర్కవుట్ కాలేదని పంత్ స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: