2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, నామ్ తమిళర్ కక్షి (NTK) ఎన్నికల ప్రణాళికను ఆ పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమాన్ విడుదల చేశారు.
వేదికపై ఆయన మాట్లాడుతూ.. “మేము 15 ఏళ్లుగా రాజకీయాల్లో, 10 ఏళ్లుగా ఎన్నికల బరిలో ఉన్నాము. డబ్బు ఉన్నవారే రాజకీయం చేయాలనే పరిస్థితిని మార్చి, మనసున్న వారు కూడా ఎన్నికల్లో నిలబడాలనే నిశ్చయంతో ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ జాతి బిడ్డలు ఈ నేల నుంచే జీవించడం నేర్చుకున్నారు. ఇది కేవలం ఎన్నికల ప్రణాళిక మాత్రమే కాదు, మా ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన బ్లూప్రింట్ ” అని పేర్కొన్నారు.
ప్రధాన హామీలు:
- న్యాయ వ్యవస్థ: తమిళనాడు కోర్టుల్లో తమిళమే అధికారిక భాషగా ఉండాలి. తమిళనాడులో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలి.
- ఎన్నికల విధానం: ఎన్నికల్లో ఈవీఎం (EVM)లను వాడకూడదు, మళ్ళీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలి.
- నీటి నిర్వహణ: చెన్నై నగర నీటి అవసరం ఏడాదికి 1200 కోట్ల ఘనడుగులు, కానీ అక్కడ 1700 కోట్ల ఘనడుగుల వర్షపాతం నమోదవుతోంది. గత ద్రావిడ ప్రభుత్వాలు ఇందులో 400 కోట్ల ఘనడుగులను కూడా నిల్వ చేయలేకపోయాయి. చెన్నైకి నీరందించే ప్రధాన సరస్సుల్లో పూడిక తీస్తే, అదనంగా 1500 కోట్ల ఘనడుగుల నీటిని నిల్వ చేయవచ్చు. దీనివల్ల నగరంలో నీటి కొరత తీరుతుంది.
- ఇసుక మాఫియా: ఇసుక దోపిడీ వల్ల నదీ తీరాల్లోని కొబ్బరి, తాటి చెట్లు ఎండిపోతున్నాయి. మూడు పంటలు పండే భూములు ఎడారిగా మారుతున్నాయి. మా ప్రభుత్వం ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికడుతుంది.
వ్యవసాయం మరియు ఉపాధి:
- సేంద్రియ వ్యవసాయం: రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిషేధించి, ప్రకృతి వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే మా ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం. తూయమల్లి, కరుప్పు కవుని వంటి 126 రకాల దేశీ వరి రకాలను తమిళ జాతీయ వరి రకాలుగా గుర్తిస్తాము.
- పరిశ్రమలు: సహజ పద్ధతిలో పండించిన టమోటా, మామిడి, పనస వంటి పండ్లతో జ్యూస్‌లు, పచ్చళ్లు తయారు చేసే పరిశ్రమలను పొలాలకు సమీపంలోనే ఏర్పాటు చేస్తాము.
- ప్రభుత్వ ఉద్యోగాలు: నిరక్షరాస్యులకు పశువుల పెంపకం, సేంద్రియ ఎరువుల తయారీ, కూరగాయల తోటల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాము. 5000 ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ, నువ్వుల సాగు చేపట్టి, అక్కడ నూనె మిల్లులను ఏర్పాటు చేస్తాము. మిగిలిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తాము.
- బీమా మరియు పెన్షన్: ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే, రైతుకు గత ఏడాది వచ్చిన ఆదాయం మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తాము. 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలవారీ పెన్షన్ అందిస్తాము.
