“OTP రాకుండానే ఖాతా ఖాళీ..!” మీ ఫోన్లోకి చొరబడే ఫేక్ యాప్.. UPI యూజర్లను హడలెత్తిస్తున్న ‘కొత్త’ సైబర్ దోపిడీ.. వెంటనే ఈ నంబర్ సేవ్ చేసుకోండి..!!

సోషల్ మీడియాలో కనిపించే గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయగానే, మీ మొబైల్ స్క్రీన్ ఒక్కసారిగా మొరాయించి ‘ఫ్రీజ్’ (Freeze) అయిపోతే అత్యంత అప్రమత్తంగా ఉండండి.

దీన్ని సాధారణ ఫోన్ సమస్యగా భావించి తేలిగ్గా తీసిపారేయకండి. ‘ఫ్రోజెన్ స్క్రీన్ స్కామ్’ (Frozen Screen Scam) అనే సరికొత్త ఎత్తుగడతో యూపీఐ (UPI) వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఖాతాలను ఊడ్చేస్తున్నారు.

ఫోన్ హ్యాంగ్ అవ్వగానే కంగారుపడే యూజర్ల బలహీనతను ఆసరాగా చేసుకుని, బ్యాంక్ కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ ఫోన్ చేస్తారు. సమస్యను సరిచేస్తామంటూ నమ్మించి ఒక నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తారు. ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన మరుక్షణమే ఫోన్ పూర్తి నియంత్రణ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

మీ మొబైల్‌కు వచ్చే రహస్య ఓటీపీ (OTP) వివరాలను మీకు ఏమాత్రం తెలియకుండానే వారు చదివేసి, యూపీఐ అకౌంట్ నుంచి డబ్బును కాజేస్తారు. అంతేకాకుండా, స్క్రీన్ షేరింగ్ యాప్స్ ద్వారా లేదా మాటల్లో పెట్టి బురిడీ కొట్టించి మీ చేతే యూపీఐ పిన్ (UPI PIN) ఎంటర్ చేయించి, అక్రమంగా వారి ఖాతాలకు నగదును మళ్లించుకుంటారు.

ఒకవేళ మీ ఫోన్ స్క్రీన్ ఇలాగే హఠాత్తుగా స్తంభించిపోతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మొబైల్ డేటా, వైఫై (Wi-Fi) కనెక్షన్‌ను ఆపివేయండి. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పే ఎలాంటి అనుమానాస్పద యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయకూడదు.

బ్యాంకు సిబ్బంది పేరుతో ఫోన్ చేసి మీ స్క్రీన్‌ను లేదా ఫోన్‌ను రిమోట్ యాక్సెస్ చేయాలని కోరితే ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకండి. ఒకవేళ మీ ఖాతా నుంచి అనుమానాస్పద రీతిలో డబ్బు మాయమైతే, వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయండి.


Posted

in

by

Tags: