Ponnambalam : చేతబడి, రసంలో గుర్రం వెంట్రుకలు, బీరులో విషం.. నటుడు పొన్నంబలం ప్రాణాలు తీయడానికి సొంత అన్న ప్లాన్!

తమిళ సినిమాలో తనదైన విలనిజంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు పొన్నంబలం, ఒక తాజా ఇంటర్వ్యూలో తనపై జరిగిన హత్యాయత్నాల గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలను బయటపెట్టారు. తన సొంత అన్నయ్యే తనను చంపడానికి అనేకసార్లు ప్రయత్నించాడని ఆయన ఆరోపించారు.

బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్న పొన్నంబలం, గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. విపరీతంగా బరువు తగ్గి, నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఆయన తన ఆరోగ్య పరిస్థితికి గల కారణాలను ఇలా వివరించారు:

కుటుంబ అసూయ మరియు వివాదం

“నేను చాలా ఆరోగ్యంగా, బలంగా ఉండేవాడిని. కానీ నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అసూయే నా ఈ స్థితికి కారణం. మా నాన్నకు నలుగురు భార్యలు. మేమందరం కలిసిమెలిసి ఒకే తల్లి పిల్లల్లా పెరిగాము. నేను సినిమాలో ఎదుగుతున్న సమయంలో నా అన్నయ్యకు 42 ఏళ్లు వచ్చాయి. ఆయనకు పెళ్లి కాకుండా నేను చేసుకోనని చెప్పాను. అయితే ఆయన ఒక పెద్ద హోటల్‌లో (పామ్‌గ్రోవ్) మాత్రమే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారు. నా వద్ద ఉన్న పొదుపు మొత్తం ఇస్తాను, చిన్న ఫంక్షన్ హాల్‌లో చేసుకుందాం అని చెప్పినా వినలేదు. అది నా జీవితంలో మొదటి దెబ్బ. ఆ తర్వాత ఆదాయపు పన్ను సమస్యల్లో నన్ను ఇరికించారు.”

చేతబడి మరియు రసంలో ‘పొడి’

పొన్నంబలం ఇంకా మాట్లాడుతూ, ఒక రాత్రి తన ఇంటి వద్ద గొయ్యి తీసి అన్నయ్య చేతబడి చేస్తున్నాడని, అది తాను చూశానని చెప్పారు. అంతేకాకుండా..

  • గుర్రం వెంట్రుకలు: అన్నయ్య ఒక వ్యక్తిని బెదిరించి, నా రసంలో ఒక రకమైన పొడిని కలిపించాడు. ఒక సిద్ధుడిని సంప్రదించగా, అది గుర్రం వెంట్రుకల పొడి అని తెలిసింది.
  • ప్రభావం: మనిషి వెంట్రుకలు కడుపులోకి వెళ్తేనే విరేచనాలు అవుతాయి. గుర్రం వెంట్రుకలు ప్రేగులకు అంటుకుపోవడం వల్ల నాకు రెండేళ్ల పాటు వరుసగా విరేచనాలు అయ్యాయి. దీనివల్ల బలంగా ఉన్న నా శరీరం క్షీణించి, షుగర్, బీపీ వచ్చాయి. షూటింగ్స్‌కు వెళ్లలేకపోయానీ.
బీరులో విషం

ఒకసారి తన పుట్టినరోజు నాడు, అప్పటివరకు మద్యం తాగడాన్ని ఇష్టపడని అన్నయ్యే స్వయంగా బీరు కొనిచ్చి తాగమని బలవంతం చేశారని పొన్నంబలం తెలిపారు.

“అందరి ఒత్తిడి మేరకు నేను కొద్దిగా తాగాను. మిగిలిన బీరు తాగిన నా స్నేహితుడికి విపరీతమైన విరేచనాలు అయ్యి, అతను చనిపోయాడు. అందులో ఏం కలిపారో తెలియదు. నేను చాలాసార్లు నా ప్రేగులను క్లీన్ చేయించుకున్నాను, కానీ అది నా కిడ్నీలపై ప్రభావం చూపింది.”

చివరగా, తన భార్యకు, అన్నయ్యకు మధ్య జరిగిన ఒక గొడవలో కోపం పెంచుకున్న అన్నయ్య.. తనను అంతం చేయాలని ఈ కుట్రలన్నీ పన్నినట్లు పొన్నంబలం వాపోయారు.


Posted

in

by

Tags: