శుక్రవారం తమ సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ అద్భుత విజయాన్ని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులకు అంకితం ఇచ్చారు.
రాజస్థాన్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. గత మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీకి చెందిన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఏప్రిల్ 27న ఢిల్లీ మరియు ఆర్సీబీ మ్యాచ్ చూసి వస్తుండగా యజ్ఞ భాటియా, అభవ్ భాటియా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత అక్షర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విజయాన్ని వారికి అంకితం ఇచ్చారు.
అక్షర్ పటేల్ పెద్ద మనసు
మ్యాచ్ అనంతరం అక్షర్ మాట్లాడుతూ.. “నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గత మ్యాచ్ సమయంలో మా అభిమానులకు జరిగిన ప్రమాదం నన్ను కలిచివేసింది. ఈ విజయాన్ని నేను వారికి అంకితం ఇస్తున్నాను” అని పేర్కొన్నారు. అక్షర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
జట్టు విజయంపై స్పందిస్తూ.. “ప్రతిరోజూ మైదానంలోకి వచ్చి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. జట్టు సభ్యులు ఆడిన తీరు అద్భుతం. మేము అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాము, ఫలితం మాకు అనుకూలంగా వచ్చింది” అని తెలిపారు.
‘స్టార్క్ ఒక లెజెండ్’
ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ రాక ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద బూస్ట్‌ను ఇచ్చింది. స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 40 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టారు. యశస్వి జైస్వాల్, రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మరియు రవీంద్ర జడేజాలను ఆయన అవుట్ చేశారు. గాయం కారణంగా స్టార్క్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.
స్టార్క్‌ను ప్రశంసిస్తూ అక్షర్ ఇలా అన్నారు.. “స్టార్క్ బౌలింగ్ చేసిన తీరు చూస్తుంటే ఆయన ఒక లెజెండ్ అని అర్థమవుతోంది. మూడు నెలల విరామం తర్వాత పునరాగమనం చేస్తూ ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం నిజంగా గ్రేట్.”
