భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCCs), గత కొన్ని ఏళ్లుగా అనుసరిస్తున్న ‘మాస్ హైరింగ్’ (ఒకేసారి భారీగా ఉద్యోగ నియామకాలు) విధానాన్ని 2026లో పూర్తిగా పక్కనపెట్టేశాయి.
ఒకవైపు TCS, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు లేఆఫ్స్, వేతనాల పెంపులో కోత, వేరియబుల్ పే తగ్గింపు వంటి సమస్యలతో ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తుంటే.. మరోవైపు ఐటీ ఉద్యోగులు ఆశగా చూసిన GCC సంస్థలు కూడా ఇప్పుడు చేతులెత్తేశాయి.
AI ప్రభావం: GCC సంస్థలు మాస్ హైరింగ్ విధానాన్ని వదిలేసి, కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతకు అనుగుణంగా కేవలం ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నాయి. గత 2-3 ఏళ్లుగా వేగంగా విస్తరించిన టెక్ టీమ్‌లు, ఇప్పుడు AI విప్లవం కారణంగా నియామక ప్రక్రియలో భారీ మార్పులను ఎదుర్కొంటున్నాయి.
నౌక్రీ నివేదిక: భారతదేశంలోని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌక్రీ.కామ్ (Naukri.com) మాతృ సంస్థ ‘ఇన్ఫో ఎడ్జ్’ (Info Edge) ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత ఏప్రిల్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో ఉద్యోగ నియామకాలు మునుపటి నెలతో పోలిస్తే 4 శాతం తగ్గాయి. ఇది ఐటీ రంగంలో కొత్తగా ఉద్యోగాల కోసం చూస్తున్న యువతలో ఆందోళన కలిగిస్తోంది.
ఎందుకు ఈ తగ్గుదల? ఈ నియామకాల తగ్గుదలపై ఇన్ఫో ఎడ్జ్ ఎండీ మరియు సీఈఓ హితేష్ ఒబరాయ్ మాట్లాడుతూ.. “కొన్ని చిన్నపాటి GCC సంస్థలు కొత్త ఉద్యోగులను నియమిస్తున్నప్పటికీ, మార్కెట్లోని కొన్ని భారీ కంపెనీలు గత కొన్ని త్రైమాసికాలుగా తమ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకుంటున్నాయి. AIని ఉపయోగించి ఇప్పటికే ఉన్న టీమ్‌ల ఉత్పాదకతను (Productivity) పెంచుకోవాలనే ఒత్తిడే ఈ నియామకాల కోతకు ప్రధాన కారణం” అని వివరించారు.
మిడ్ మరియు సీనియర్ స్థాయికి డిమాండ్: ఈ సాంకేతిక మార్పుల వల్ల ఫ్రెషర్స్ కంటే, మధ్యస్థ మరియు సీనియర్ స్థాయి (4 నుండి 12 ఏళ్ల అనుభవం ఉన్న) టెక్ నిపుణులకు డిమాండ్ పెరిగింది. ANSR మరియు NLB సర్వీసెస్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం GCC సంస్థల్లో నియామకం అవుతున్న వారిలో 55% నుండి 70% వరకు అనుభవజ్ఞులే ఉండటం గమనార్హం.
5 కీలక సాంకేతికతలు: ప్రస్తుత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో, GCC సంస్థలు సాధారణ విస్తరణను నిలిపివేసి, ఈ కింది 5 ప్రత్యేక విభాగాల్లో నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నాయి:
- కృత్రిమ మేధస్సు (AI)
- క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud Computing)
- సైబర్ సెక్యూరిటీ (Cybersecurity)
- ప్లాట్‌ఫామ్ ఇంజనీరింగ్ (Platform Engineering)
- ప్రొడక్ట్ డెవలప్మెంట్ (Product Development)
