వడోదర: మహిళా ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. వరుసగా రెండో ఏడాది కూడా డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుని ఆర్‌సీబీ రికార్డు సృష్టించింది.
వడోదరలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన మరియు జార్జియా వాల్ అద్భుత ప్రదర్శన ముందు అది చిన్నబోయింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు మెరుపు వేగంతో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఢిల్లీ టైటిల్ కలని చెరిపివేశారు. ఇక ఆఖరి ఓవర్లో రాధా యాదవ్ రెండు ఫోర్లు కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఆర్‌సీబీ అద్భుత విజయం 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. గ్రేస్ హారిస్ కేవలం 9 పరుగులకే అవుట్ కావడంతో ఢిల్లీ సంబరాల్లో మునిగిపోయింది. కానీ మంధాన, వాల్ ఆ సంతోషాన్ని ఎంతో సేపు ఉంచలేదు. మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ కేవలం 23 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేయగా, జార్జియా వాల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. వీరిద్దరూ కలిసి 92 బంతుల్లో 165 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ఆర్‌సీబీని గెలుపు ముంగిట నిలిపారు.
ఆఖరి ఓవర్ ఉత్కంఠ 19వ ఓవర్లో స్మృతి మంధాన (87) అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరమైన దశలో రాధా యాదవ్ వరుసగా రెండు ఫోర్లు బాది ఆర్‌సీబీకి విజయాన్ని అందించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్లో ఓటమిని చవిచూసింది. ఢిల్లీ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ (50), లారా వోల్వార్డ్ (44) మెరుపులు వృధా అయ్యాయి.
