ప్రపంచ భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్న తరుణంలో, రష్యా గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా తన బంగారు నిల్వలను విక్రయించడం ప్రారంభించింది.
తమ దేశ బడ్జెట్ ఒత్తిడిని అధిగమించేందుకే రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లోకి భారీగా బంగారం వచ్చి చేరే అవకాశం ఉండటంతో, రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఒకానొక దశలో 5,500 డాలర్ల వద్ద ఉన్న బంగారం ధర ఇప్పుడు 4,500 డాలర్లకు చేరింది. ఇంత తక్కువ కాలంలో ధరలు ఈ స్థాయిలో తగ్గడానికి గల్ఫ్ యుద్ధం ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ తరుణంలో బంగారం విషయంలో రష్యా ఆడుతున్న ‘గేమ్’ గురించిన ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది.
బంగారాన్ని విక్రయిస్తున్న రష్యా
అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లో ఒక పెద్ద మార్పు మొదలైంది. రష్యా సెంట్రల్ బ్యాంక్ తన బంగారు నిల్వలను విక్రయించడం ప్రారంభించింది. గత 25 ఏళ్లలో లేని విధంగా నేరుగా మార్కెట్లో బంగారాన్ని అమ్ముతోంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న సైనిక ఖర్చుల వల్ల ఏర్పడిన బడ్జెట్ లోటును తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు ‘bne Intellinews’ నివేదిక పేర్కొంది. ఇది రష్యా ఆర్థిక స్థితిలో వస్తున్న ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తోంది.
టన్నుల కొద్దీ బంగారం
2022 నుండి 2025 వరకు, రష్యా తన బంగారం మరియు విదేశీ కరెన్సీ విక్రయాల ద్వారా 15 ట్రిలియన్ రూబుల్స్ ($150 బిలియన్లు) ఆర్జించింది. అయితే 2026 మొదటి రెండు నెలల్లోనే ఈ అమ్మకాలు వేగవంతమై 3.5 ట్రిలియన్ రూబుల్స్ ($35 బిలియన్లు) కు చేరుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి. రష్యా సెంట్రల్ బ్యాంక్ 2026 జనవరిలో 3,00,000 ఔన్సుల బంగారాన్ని, ఫిబ్రవరిలో మరో 2,00,000 ఔన్సుల బంగారాన్ని విక్రయించింది. అంటే మొత్తం సుమారు 14 టన్నుల బంగారాన్ని రష్యా అమ్మేసింది.
ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. గతంలో రష్యా జరిపిన బంగారు విక్రయాలు కేవలం పేరుకే ఉండేవి. అంటే రష్యా సెంట్రల్ బ్యాంక్ అమ్మితే, రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ కొనేది. దీనివల్ల బంగారం బయట మార్కెట్లోకి వచ్చేది కాదు. కానీ ఇటీవల కాలంలో సెంట్రల్ బ్యాంక్ నేరుగా అంతర్జాతీయ మార్కెట్లోనే అమ్మకాలు మొదలుపెట్టింది.
తగ్గుతున్న నిల్వలు
ఈ ప్రత్యక్ష విక్రయాల ఫలితంగా, రష్యా బంగారు నిల్వలు 74.3 మిలియన్ ఔన్సులకు పడిపోయాయి. ఇది గత నాలుగేళ్లలో అతి తక్కువ స్థాయి. 2002 తర్వాత రష్యా ఈ స్థాయిలో ఒకేసారి బంగారాన్ని విక్రయించడం ఇదే మొదటిసారి.
ఉక్రెయిన్ యుద్ధం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగుతుండటంతో రష్యాపై ఆర్థిక భారం పెరిగింది. 2025లో రష్యా బడ్జెట్ లోటు 0.5% ఉంటుందని అంచనా వేయగా, అది కాస్తా 2.6% (GDPలో) కు పెరిగింది. కొందరు ఇది 3.4% వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ఈ లోటును పూడ్చుకోవడానికి రష్యా తన వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించడం ప్రారంభించింది. గత వారం ఒక ఔన్సు బంగారం ధర రికార్డు స్థాయిలో $5,000 దాటగా, ఆ సమయాన్ని రష్యా తనకు అనుకూలంగా మార్చుకుంది.
ధరల తగ్గుదల
ప్రస్తుతానికి రష్యా వద్ద ఇంకా 2,000 టన్నులకు పైగా బంగారం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. రష్యా విక్రయాల వల్ల ప్రపంచంలో ఐదవ అతిపెద్ద బంగారు నిల్వలు ఉన్న దేశంగా భారత్ అవతరించింది. మరోవైపు రష్యా తన విదేశీ అప్పులను వేగంగా తగ్గిస్తోంది. ఇప్పుడు రష్యా అప్పు దాని GDPలో కేవలం 14% మాత్రమే ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ.
మొత్తానికి విదేశీ అప్పులు తీర్చడానికి, బడ్జెట్ లోటును తగ్గించడానికి రష్యా తన బంగారు నిల్వలను వాడుకుంటోంది. ఇదే ధోరణి కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
