హిందూ మత విశ్వాసాల ప్రకారం, మరణం అనేది కేవలం జీవితానికి ముగింపు మాత్రమే కాదు; ఆత్మ ఒక శరీరం నుంచి మరో శరీరానికి లేదా ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారే ప్రక్రియగా భావిస్తారు.
ఒక వ్యక్తి తన సహజమైన ఆయుష్షు తీరకముందే ప్రమాదాలు, విపత్తులు లేదా ఇతర అసహజ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోవడాన్ని ‘అకాల మరణం’ అంటారు. దీని గురించి గరుడ పురాణంలో పలు విశ్వాసాలు, స్పష్టమైన వివరణలు ఉన్నట్లు ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు.
అకాల మరణం తర్వాత ఆత్మకు ఏం జరుగుతుంది అనేది చాలామందిలో ఉండే సందేహం. పురాణ విశ్వాసాల ప్రకారం.. సహజ మరణంతో పోలిస్తే, అకాల మరణం చెందిన వారి ఆత్మ స్థితి భిన్నంగా ఉంటుంది. అటువంటి ఆత్మలకు వెంటనే పునర్జన్మ లేదా మోక్షం వంటి తదుపరి దశ లభించదని, అవి ప్రేత రూపంలో లేదా వాయు రూపంలో మధ్యంతర స్థితిలోనే సంచరిస్తుంటాయని నమ్ముతారు.
అంతేకాకుండా, నెరవేరని కోరికలు, కుటుంబంపై మమకారం, ప్రాపంచిక బంధాల కారణంగా ఆ ఆత్మలు తీవ్ర అశాంతితో ఉంటాయని నమ్ముతారు. అందుకే అకాల మరణం పొందిన వారి ఆత్మ శాంతికై ప్రత్యేక పూజలు, సంస్కారాలు నిర్వహిస్తుంటారు.
అకాల మరణం చెందిన తర్వాత ఆత్మ ఎంతకాలం ఆ స్థితిలో ఉంటుంది అనేదానికి కూడా శాస్త్రాల్లో వివరణ ఉంది. ఆ వ్యక్తికి విధించిన నిర్దేశిత ఆయుష్షు పూర్తయ్యేంత వరకు ఆత్మ అదే మధ్యంతర స్థితిలో కొనసాగుతుందని చెబుతారు. అందుకే ఆ ఆత్మ శాంతి కోసం శ్రాద్ధ కర్మలు, తర్పణం, పిండ ప్రదానం వంటి క్రతువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. గయలో పిండ ప్రదానం చేయడం, త్రయంబకేశ్వర్‌లో నారాయణ నాగబలి వంటి ప్రత్యేక పూజలు జరిపించడం వల్ల ఆత్మకు విముక్తి లభించి సద్గతులు కలుగుతాయని విశ్వసిస్తారు.

Leave a Reply