“అక్కా.. నన్ను చంపేయబోతున్నారు” అని చెప్పాడు..! మరుసటి రోజే బీచ్‌లో శవమై తేలిన మత్స్యకారుడు.. విశాఖపట్నంలో భయానక ఘటన..!!

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలోని తీర ప్రాంతంలో మైలపల్లి చండి అనే మత్స్యకారుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హత్య చేసి, మృతదేహాన్ని సముద్ర తీరంలో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు.

తనను కొందరు వ్యక్తులు నిరంతరం చంపేస్తామని బెదిరిస్తున్నారని చండి.. మరణానికి ఒక రోజు ముందు తన సోదరికి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఆ మాట చెప్పిన మరుసటి రోజే అతడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపుతోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. చండి తలపై కర్రతో బలంగా కొట్టిన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే, మెడకు నైలాన్ తాడు బిగించి ఉరి వేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చండి.. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుడిగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. భార్య, పిల్లలతో కలిసి విశాఖపట్నంలో నివసిస్తున్నాడు.

ఈ ఘటనపై చండి సోదరి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చండిని ఎవరు, ఎందుకు హత్య చేశారనే కోణంలో పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు.


Posted

in

by

Tags: