సమాజ్‌వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు భండారాలో పూరీ వడ్డించిన దళిత టీచర్ అంజలి కుటుంబం ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ఆమె తండ్రిని సూపర్వైజర్ పదవి నుండి తొలగించి సఫాయీ కర్మిచారి (స్వీపర్)గా డిమోషన్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న అంజలి తండ్రి భండారా (అన్నదానం) ఏర్పాటు చేశారు.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న అఖిలేష్ యాదవ్‌ను అంజలి ఆపి, భండారా ప్రసాదం స్వీకరించాలని కోరారు. ఆయన అక్కడ ఆగి పూరీ తినగా, ఆమె ఆయనను ప్రశంసించారు. బుధవారం అంజలి ఎస్పీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ కోసం ఇలాంటి వంద ఉద్యోగాలనైనా త్యాగం చేస్తామని ఉద్వేగంగా చెప్పారు.
గతంలో ఫతేపూర్‌లో అఖిలేష్ యాదవ్‌కు టీ ఇచ్చిన దుకాణదారుడిపై కూడా ఆహార శాఖ దాడులు చేసింది. ఆ వేధింపులు భరించలేక అతను దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. అప్పట్లో అఖిలేష్ ఆ దుకాణదారుడిని పిలిపించి సన్మానించి, అల్యూమినియం పాత్రలకు బదులుగా ఇత్తడి పాత్రలను బహుకరించారు.
రాజకీయ కక్షసాధింపు ఆరోపణలు:
ఇంగ్లీష్‌లో ఎం.ఏ చేసిన అంజలి ఆరోపణల ప్రకారం.. ఏప్రిల్ 14న అఖిలేష్ యాదవ్‌కు పూరీ వడ్డించినందుకే ప్రభుత్వం తన తండ్రిపై కక్ష కట్టిందని, అందుకే ఆయనను సూపర్వైజర్ నుండి స్వీపర్‌గా మార్చారని వాపోయారు. దీనిని ఆమె “కుంభకోణం”గా అభివర్ణించారు. “అఖిలేష్ జీ, మీ కోసం ఇలాంటి వంద ఉద్యోగాలనైనా త్యాగం చేస్తాను, నా తండ్రి మీకు పంపిన సందేశం ఇదే” అని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు కంటోన్మెంట్ బోర్డు పరిపాలన విభాగం స్పందిస్తూ.. ఉద్యోగి ఉమేష్ కుమార్ (అంజలి తండ్రి) అనుమతి లేకుండా రక్షణ శాఖ అధికారులను భండారాకు ఆహ్వానించినందుకే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.
ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ ఆగ్రహం:
ఈ ఘటనపై అఖిలేష్ యాదవ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా యోగి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “PDA (వెనుకబడిన, దళిత, మైనారిటీ) సమాజానికి చెందిన ఒక మహిళ తండ్రిని బీజేపీ ప్రభుత్వం వేధిస్తోంది. బాబాసాహెబ్ జయంతి నాడు నేను ఆ చెల్లెలి చేతి వంట తినడమే ఆయన చేసిన తప్పా?” అని ప్రశ్నించారు.
బిజేపిని పీడీఏ వ్యతిరేకిగా అభివర్ణించిన అఖిలేష్, గతంలో ఒక టీ వ్యాపారిని వేధించిన ఉదాహరణను కూడా గుర్తు చేశారు.
ఫతేపూర్ ఘటన నేపథ్యం:
ఫతేపూర్‌లో అఖిలేష్ యాదవ్ ఒక చిన్న హోటల్లో టీ తాగిన కొద్దిసేపటికే ఆహార శాఖ అధికారులు అక్కడ సోదాలు చేశారు. అల్యూమినియం గిన్నెలో టీ చేస్తున్నారనే కారణంతో భారీగా జరిమానా విధించారు. ఆ తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ఆ వ్యాపారిపై దాడి చేయడంతో అతను భయంతో దుకాణం మూసివేశారు. అఖిలేష్ యాదవ్ అతనికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు ప్రత్యేకంగా ఇత్తడి పాత్రలను అందజేసి అండగా నిలిచారు.
