అణ్ణామలై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. ఎట్టకేలకు బీజేపీ “ఆ” జాబితాలో చేరిన అణ్ణామలై పేరు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే – బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ అధిష్ఠానం విడుదల చేసింది. ప్రధాని మోదీతో పాటు 10 మంది కేంద్ర మంత్రులు, 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 21 మంది జాతీయ మరియు రాష్ట్ర స్థాయి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా అణ్ణామలై పేరు కూడా చోటు చేసుకుంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. అన్నాడీఎంకే కూటమిలో భాగంగా బీజేపీకి 27 నియోజకవర్గాలు కేటాయించారు. అయితే నిన్న విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో అణ్ణామలై పేరు గానీ, ఆయన మద్దతుదారుల పేర్లు గానీ లేకపోవడం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన అణ్ణామలై.. తాను అభ్యర్థిగా లేకపోయినా పార్టీ అభ్యర్థుల విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ప్రచారం నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆయనను స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేసింది.

ప్రచార బరిలో హేమాహేమీలు: ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి, ఎల్.మురుగన్, సురేష్ గోపి తదితరులు ఉన్నారు.

ముఖ్యమంత్రుల విభాగంలో యోగి ఆదిత్యనాథ్ (యూపీ), మోహన్ యాదవ్ (ఎంపీ), దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర డిప్యూటీ సీఎం), భజన్‌లాల్ శర్మ (రాజస్థాన్), హిమంత బిస్వ శర్మ (అసోం) తదితరులు ప్రచారానికి రానున్నారు. తమిళనాడు నుంచి నైనార్ నాగేంద్రన్, అణ్ణామలై, పొన్ రాధాకృష్ణన్, తమిళిసై సౌందరరాజన్, హెచ్.రాజా, వానతీ శ్రీనివాసన్, కుష్బూ సుందర్, నటి నమిత వంటి వారు ఓటర్లను ఆకట్టుకోనున్నారు.

కాగా, ఈ జాబితాలో రాధిక శరత్ కుమార్, వినోజ్ పి. సెల్వం, కేటీ రాఘవన్ వంటి వారి పేర్లు లేకపోవడం గమనార్హం.


Posted

in

by

Tags: