మధ్యప్రదేశ్ రాష్ట్రం దమోహ్ జిల్లాలోని సమన్నా గ్రామంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి చిహ్నమైన ‘భాయ్ దూజ్’ పండుగ రోజున ఒక ఘోరం జరిగింది. 16 ఏళ్ల భరత్ విశ్వకర్మ అనే బాలుడు అత్యంత క్రూరంగా హత్యకు గురవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తన సోదరిని కలవడానికి వెళ్తున్న భరత్పై, అదే ప్రాంతానికి చెందిన గుడ్డా పటేల్ అనే వ్యక్తి ఇనుప రాడ్తో దాడి చేశాడు. ఆపై సుత్తితో కొట్టి అతి కిరాతకముగా హత్య చేశాడు.
రక్తం తాగి.. మాంసం తినడానికి ప్రయత్నం!
ఇటీవలే జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చిన గుడ్డా పటేల్, ఆ బాలుడిని చంపడమే కాకుండా.. అతని రక్తాన్ని తాగాడని, మాంసాన్ని తినడానికి ప్రయత్నించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాటలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
కానీ ఈ దాడికి ఎలాంటి ముందస్తు శత్రుత్వం లేదని, బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా ఈ అటాక్ జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడు గుడ్డా పటేల్ గతంలో తన భార్యను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లాడని, అతనికి మానసిక స్థితి సరిగా లేదని అనుమానిస్తున్నారు.
గ్రామస్థుల ఆగ్రహం
ఘటన జరిగిన వెంటనే గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక పవిత్రమైన పండుగ రోజున జరిగిన ఈ అమానవీయ ఘటన ఆ గ్రామం మొత్తాన్ని విషాదంలో ముంచెత్తింది.
