“అది మాత్రం జరగనివ్వను”.. ప్రియురాలిని గొంతు నులిమి చంపేసిన ప్రియుడు! సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్.. మూసి ఉన్న ఇంట్లో శవమై తేలిన యువతి.. బెంగళూరులో దారుణం!

బెంగళూరు: బెంగళూరులోని తులసి నగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న భవానీ ఎస్. (22) అనే ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని.. ఆమె ప్రియుడి చేతిలోనే దారుణంగా హత్యకు గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

దిగలారపాళ్యలోని ఒక మొబైల్ షాపులో పనిచేస్తున్న భవానీ, తన చదువు పూర్తయిన తర్వాత బెంగళూరులోనే ఉంటూ ఉద్యోగం చేస్తోంది.

జూన్ 13, శనివారం ఉదయం.. భవానీ ఒక యువకుడితో కలిసి ఉన్న కొన్ని వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన ఆమె బంధువులు వెంటనే యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీనితో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు భవానీకి ఫోన్ చేయగా.. ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, వారు ఇంటి యజమానికి, చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా భవానీ ఉంటున్న ఇంటి తలుపులు లోపలి నుండి వేసి ఉన్నాయి.

తలుపులు బద్దలు కొట్టి చూడగా..
అనుమానం వచ్చిన పొరుగువారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవానీ కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నాక, పోలీసులు స్థానికుల సహాయంతో ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ గదిలో భవానీ కిందపడి శవమై కనిపించగా.. చంద్రశేఖర్ అనే యువకుడు స్పృహ తప్పి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. ఆ గదిలో ఏదో విషపూరితమైన పదార్థం వాసన వస్తోందని, చంద్రశేఖర్‌ను చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

వేరే పెళ్లి కుదిరిందనే పగతో..
మృతురాలి తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. చంద్రశేఖర్ గత కొంతకాలంగా తన కూతురితో ప్రేమాయణం సాగిస్తున్నాడని పేర్కొన్నారు. అయితే భవానీకి ఆమె కుటుంబ సభ్యులు వేరే యువకుడితో వివాహం నిశ్చయం చేయడాన్ని చంద్రశేఖర్ తీవ్రంగా వ్యతిరేకించాడని, “ఆ పెళ్లి జరగనివ్వను” అంటూ గతంలో బెదిరించాడని తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ భవానీని ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఆమె ఇంటికి వచ్చి, గొంతు నులిమి హత్య చేశాడని.. అనంతరం ఆధారాలను మాయం చేసే ప్రయత్నం చేసి, తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags: