“అన్నా.. నా ఫ్రెండ్‌కు 1 రూపాయి పంపండి!” నమ్మి పంపిన దుకాణదారుడు.. ఆ తర్వాత జరిగింది షాక్! 1 రూపాయి పంపమని అడిగి UPI PIN పసిగట్టిన మోసగాడు.!!!

పుస్తకాలు కొనేందుకు వచ్చినట్లుగా దుకాణంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి, దుకాణదారుడితో మాటలు కలిపి నమ్మకం కుదిర్చి, సరికొత్త తరహాలో రూ. 50 వేలు కాజేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వేంసూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పుస్తకాల దుకాణానికి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి, కొన్ని పుస్తకాలు కొంటానని చెప్పాడు. దుకాణదారుడు పుస్తకాలను తీసి చూపిస్తున్న సమయంలో.. తన స్నేహితుడికి కేవలం రూ.1 పంపాలని అతను కోరాడు. ఆ డబ్బును తన స్నేహితుడు వెంటనే తిరిగి పంపేస్తాడని చెప్పడంతో.. అది నమ్మిన దుకాణదారుడు తన ఫోన్ నుంచి ఒక రూపాయి పంపాడు.

ఆ సమయంలో డబ్బు పంపేందుకు దుకాణదారుడు తన యూపీఐ (UPI) పిన్ నంబర్‌ను నమోదు చేస్తుండగా, ఆ మోసగాడు దానిని నిశితంగా గమనించాడు. ఆ తర్వాత తనకు మరికొన్ని పుస్తకాలు కావాలని అడిగాడు. పుస్తకాలను తీసుకురావడానికి దుకాణదారుడి భార్య లోపలికి వెళ్లింది. అదే సమయంలో దుకాణదారుడు కూడా పక్కనే ఉన్న మరో దుకాణానికి వెళ్లాడు. దీన్ని అదనుగా భావించిన ఆ వ్యక్తి, కౌంటర్‌పై ఉన్న దుకాణదారుడి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు.

కొద్దిసేపటి తర్వాత ఫోన్ కనిపించకపోవడంతో దుకాణదారుడు షాక్‌కు గురయ్యాడు. ఈలోగా ఆ మోసగాడు తాను అప్పటికే గుర్తుపెట్టుకున్న యూపీఐ పిన్ నంబర్‌ను ఉపయోగించి, దుకాణదారుడి బ్యాంక్ ఖాతా నుంచి మూడు లావాదేవీల్లో మొత్తం రూ. 50 వేలు కాజేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు కట్ అయినట్లు వేరొకరి ద్వారా తెలుసుకున్న వెంటనే దుకాణదారుడు బ్యాంకును సంప్రదించాడు. ఖాతాను వెంటనే ఫ్రీజ్ చేయడంతో, అందులో ఉన్న మరో రూ. 30 వేల నగదు భద్రంగా మిగిలిపోయాయని అధికారులు తెలిపారు. దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో నిందితుడి ముఖం రికార్డైంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సెల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. యూపీఐతో సహా డిజిటల్ నగదు లావాదేవీల విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా, యూపీఐ పిన్ నంబర్‌ను ఎవరికీ కనిపించకుండా రహస్యంగా నమోదు చేయాలని, పరిచయం లేని వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి నగదు లావాదేవీలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *