మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ పాఠశాలలను తమ సొంత ఖర్చులతో పునరుద్ధరించిన స్థానిక యువకులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. చిన్నారుల చదువుకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు వారు చేసిన ఈ ప్రయత్నం అందరి హృదయాలను హత్తుకుంటోంది.
గుణా జిల్లాలోని బమోరి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రిషి అగర్వాల్.. పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల సంక్షేమం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే మాటలతో స్ఫూర్తి పొందిన కొందరు యువకులు.. శిథిలావస్థకు చేరిన భవనాల్లా కనిపిస్తున్న మఢై, తారాపూర్ గ్రామాల్లోని రెండు ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నదే తడవుగా తమ సొంత డబ్బుతో లక్షన్నర రూపాయలకు పైగా ఖర్చు చేశారు. పాఠశాల పైకప్పులకు మరమ్మతులు చేయించడంతో పాటు, గోడలకు రంగులు వేయించి పాఠశాలల రూపురేఖలనే మార్చేశారు.
కొత్త రూపు సంతరించుకున్న పాఠశాలలను చూసి చిన్నారులు ఎంతో సంతోషించారు. అంతటితో ఆగకుండా.. “అన్నా.. మా తరగతి గదులను కూడా ఇంకా అందంగా మార్చి పెట్టండి!” అంటూ ఆప్యాయంగా కోరారు.
చిన్నారుల మాటలకు కరిగిపోయిన ఆ యువకులు.. వారి కోరికను కూడా నెరవేర్చి అదనపు గదులను సైతం అందంగా తీర్చిదిద్దారు.
పిల్లల భవిష్యత్తు కోసం తమ సొంత డబ్బును ఖర్చు చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడిన ఈ యువకుల సేవాభావంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
చదువుకునే చిన్నారుల కోసం తమ వంతు బాధ్యతగా ముందుకొచ్చిన ఈ యువకులు నిజంగా అభినందనీయులు!

Leave a Reply