కోయంబత్తూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం AIADMK – BJP కూటమి ఖరారైంది. ఈ కూటమిలో బీజేపీకి 27 నియోజకవర్గాలను కేటాయించారు.
అయితే, అన్నామలై ఆశించిన నియోజకవర్గాలు బీజేపీకి దక్కలేదు. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అన్నామలైని బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నేరుగా ఆయన ఆడుతున్న బ్యాడ్మింటన్ కోర్టుకే వెళ్లి, ఆయనతో కలిసి కాసేపు ఆట ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోను అన్నామలై తన ‘X’ ఖాతాలో పంచుకోగా, దీని వెనుక ఉన్న అసలు కారణంపై చర్చ జరుగుతోంది.
సీట్ల సర్దుబాటులో అసంతృప్తి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అన్నాడీఎంకే కూటమిలో బీజేపీకి కేటాయించిన 27 సీట్లలో మైలాపూర్, మొడకురిచ్చి, కోయంబత్తూరు నార్త్ వంటి కీలక స్థానాలు ఉన్నాయి. అయితే, అన్నామలై కోయంబత్తూరు జిల్లాలోని సింగనల్లూర్ లేదా కౌండంపాలయం నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని భావించారు. కానీ ఎడప్పాడి పళనిస్వామి (EPS) ఆ నియోజకవర్గాలను కేటాయించలేదు. కేవలం కోయంబత్తూరు నార్త్ మాత్రమే ఇచ్చారు, అక్కడ ఇప్పటికే వానతీ శ్రీనివాసన్ పోటీ చేస్తున్నారు.
పోటీకి అన్నామలై దూరం?
తను కోరుకున్న సీట్లు దక్కకపోవడంతో అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన పోటీలో ఉంటే కూటమికి బలం చేకూరుతుందని భావించిన బీజేపీ అధిష్టానం, ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో ఆందోళన చెందుతోంది. అందుకే అన్నామలైని ప్రసన్నం చేసుకునే బాధ్యతను తమిళనాడు ఎన్నికల సహ-ఇంచార్జ్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌కు అప్పగించింది.
బ్యాడ్మింటన్ కోర్టులో బుజ్జగింపులు
కోయంబత్తూరులో అన్నామలై బ్యాడ్మింటన్ ఆడుతుండగా, కేంద్ర మంత్రి అక్కడికి వెళ్లారు. ఇద్దరూ కలిసి కాసేపు ఆడిన తర్వాత, మంత్రి ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం అన్నామలై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “శరీర కదలికలకు, స్వేదానికి బ్యాడ్మింటన్‌ను మించిన ఆట లేదు. కోయంబత్తూరులో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మాతో చేరడం సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.
బిజెపి అగ్ర నాయకత్వం దిగివచ్చి బుజ్జగిస్తున్న నేపథ్యంలో, అన్నామలై తన పంతం వీడి పోటీకి సై అంటారా? లేక తన నిర్ణయానికే కట్టుబడతారా? అనేది వేచి చూడాలి.
