ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయ ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వీల్‌చైర్లలో వరుసగా కూర్చుని ఉన్న ఫోటో ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వైరల్ అవుతోంది.
ఈ ఉచిత వీల్‌చైర్ సదుపాయాన్ని అవసరం లేని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారా అనే అనుమానాలను ఈ చిత్రం రేకెత్తించడమే కాకుండా, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వైరల్ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తూ.. ఉచితంగా అందించడం వల్లే ఈ సేవలు దుర్వినియోగం అవుతున్నాయని, వీటికి నామమాత్రపు రుసుము లేదా డాలర్లలో ఛార్జీ విధిస్తేనే ఇలాంటి దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, దీనివల్ల నిజంగా సహాయం అవసరమైన దివ్యాంగులకు, వృద్ధులకు సమయానికి వీల్‌చైర్ సేవలు అందక తీవ్ర జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే మరికొందరు భిన్నంగా స్పందిస్తూ.. ఎయిర్‌పోర్టుల్లో ఎక్కువ దూరం నడవాల్సి రావడం, భాషా సమస్యలు మరియు దారి చూపే సైన్‌బోర్డులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లే చాలామంది వీల్‌చైర్ సేవలను ఆశ్రయిస్తుంటారని వివరించారు. కాబట్టి, వీల్‌చైర్లకు బదులుగా వృద్ధులు, సాధారణ ప్రయాణికులు విమానాశ్రయంలో సులభంగా రాకపోకలు సాగించేందుకు ‘గైడెన్స్ అసిస్టెన్స్’ (మార్గదర్శక సహాయక సేవలు) వంటి ప్రత్యామ్నాయాలను ప్రవేశపెట్టాలని సూచించారు.

Leave a Reply