ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా అమెరికా అనుభవిస్తున్న ఏకఛత్రాధిపత్యానికి ఇప్పుడు భారత్ గట్టి పోటీ ఇస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తాజాగా విడుదల చేసిన గణాంకాలు వాషింగ్టన్ నుండి లండన్ వరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ మార్పుపై ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కూడా స్పందించారు. ఈ గణాంకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “ప్రపంచ శక్తి సమతుల్యత మారుతోంది” (The balance of power is changing) అని ఆయన వ్యాఖ్యానించారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి? IMF అంచనాల ప్రకారం, 2026 నాటికి ప్రపంచ GDP వృద్ధిలో భారతదేశం వాటా 17% ఉండబోతోంది. ఇదే సమయంలో అమెరికా వాటా కేవలం 9.9% కి పడిపోనుంది. ఈ జాబితాలో చైనా 26.6% తో మొదటి స్థానంలో ఉంది. భారత్ మరియు చైనా రెండు దేశాలు కలిపి ప్రపంచ వృద్ధిలో 43% పైగా బాధ్యత వహించనున్నాయి.
భారత్ వైపు మస్క్ చూపు: ఎలోన్ మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన వ్యాపార వ్యూహంతో ముడిపెట్టి చూస్తున్నారు. మస్క్ గత కొంతకాలంగా భారత్‌లో టెస్లా ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పాశ్చాత్య దేశాలు మరియు చైనాలో టెస్లా అమ్మకాల వేగం తగ్గుతున్న తరుణంలో, భారత మార్కెట్ మస్క్‌కు పెద్ద అవకాశంగా కనిపిస్తోంది.
తయారీ రంగమే అసలు బలం: భారత్ విజయం వెనుక కేవలం జనాభా మాత్రమే కాదు, మౌలిక సదుపాయాలపై పెడుతున్న భారీ ఖర్చు మరియు తయారీ రంగం (Manufacturing) లో కనిపిస్తున్న జోరే ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. ఐరోపా దేశాలైన జర్మనీ (0.9%), మొత్తం యూరప్ (2%) వృద్ధి మందగించిన సమయంలో భారత్, వియత్నాం, ఇండోనేషియా వంటి ఆసియా దేశాలు ఆర్థిక కేంద్రాలుగా మారుతున్నాయి.
