‘అభివృద్ధికి పైసా కూడా మిగలదు…’: ఎన్నికల ముందు ఉచితాల పంపిణీపై సుప్రీంకోర్టు ఘాటు విమర్శలు

ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఇచ్చే ‘ఉచిత హామీల’పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను మందలిస్తూ.. “మీరు ఇలాగే ఉచిత ఆహారం, ఉచిత విద్యుత్ వంటివి ఇస్తూ పోతే, అభివృద్ధి పనుల కోసం డబ్బు ఎక్కడి నుండి వస్తుంది?” అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వినియోగదారుల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ అందించాలన్న ‘తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్’ ప్రతిపాదనతో ఈ అంశం మళ్ళీ చర్చకు వచ్చింది.

అప్పుల్లో ఉన్నా ఆగని ఉచితాలు

కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “అనేక రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లోటును ఎదుర్కొంటున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు లేవని ఫిర్యాదు చేస్తున్నాయి. కానీ మరోవైపు సబ్సిడీల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.” అని పేర్కొంది. ముఖ్యంగా బిల్లులు చెల్లించగలిగే స్తోమత ఉన్న వారికి కూడా ఉచితాలు ఇవ్వడం వల్ల, ‘పని చేయని సంస్కృతి’కి ప్రోత్సాహం లభిస్తుందని కోర్టు హెచ్చరించింది.

ఉచితాల సంస్కృతి దేశాభివృద్ధికి ఆటంకం

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ మరియు జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది:

  • పునరాలోచన: దేశ ఆర్థిక వృద్ధిని అడ్డుకునే ఇటువంటి విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
  • పేదలకే ప్రాధాన్యత: పేదలకు సహాయం చేయడం అర్థం చేసుకోదగ్గ విషయమే, కానీ ధనిక-పేద తేడా లేకుండా అందరికీ ఉచితాలు ఇవ్వడం ఏంటి?
  • ఉపాధిపై దృష్టి: ఉచితంగా ఆహారం, సైకిళ్లు, విద్యుత్ ఇచ్చే బదులు.. రాష్ట్రాలు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి.
ఇది ప్రలోభపెట్టడం కాదా?

“భారతదేశంలో మనం ఎటువంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాం? బిల్లులు కట్టలేని వారికి ఉచితంగా ఇవ్వడం సంక్షేమ పథకం కిందకు వస్తుంది. కానీ స్తోమత ఉన్నవారికి కూడా పంచడం అంటే అది ఓటర్లను ప్రలోభపెట్టడం (Appeasement Policy) కాదా?” అని సీజేఐ ప్రశ్నించారు. రాష్ట్రాలు కేవలం జీతాలు ఇవ్వడానికి, ఉచితాలు పంచడానికే నిధులు వాడుతున్నాయని, అభివృద్ధి ప్రాజెక్టులను విస్మరిస్తున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.


Posted

in

by

Tags: