మధ్యప్రాచ్యంలో ఇరాన్ మరియు అమెరికా మధ్య పోరు ముదురుతున్న వేళ, ఇరాన్ తన దాడుల దిశను మార్చింది. ఇప్పటివరకు అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేసిన ఇరాన్, ఇప్పుడు తన దాడులను ఐక్య అరబ్ ఎమిరేట్స్ (UAE) యొక్క అంతర్గత ఆర్థిక కేంద్రాల వైపు మళ్లించింది.
యుఏఈలోని మూడు ప్రధాన ఓడరేవులపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ముఖ్యంగా దుబాయ్ లోని జెబెల్ అలీ పోర్ట్, అబుదాబిలోని ఖలీఫా పోర్ట్ మరియు ఫుజైరా పోర్ట్ తమ లక్ష్యాలని ప్రకటించింది. ఈ ప్రాంతాల నుండి ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని ఇరాన్ హెచ్చరించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది.
ఫుజైరాపై దాడి – ఆందోళనలో ప్రపంచం: ఈ హెచ్చరిక వెలువడిన కొద్దిసేపటికే, ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ఫుజైరాలోని చమురు నిల్వ కేంద్రంపై దాడి చేసింది. దీనివల్ల అక్కడి రిఫైనరీలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రపంచ ఇంధన అవసరాలలో 2 శాతం వాటా కలిగిన ఫుజైరా ఓడరేవు నిలిచిపోవడం అంతర్జాతీయ కచ్చా చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఈ ఓడరేవు నుండి రోజుకు సగటున 1.7 మిలియన్ బారెల్స్ చమురు ఎగుమతి కావడం గమనార్హం.
కారణం ఏమిటి? ఇరాన్ యొక్క ఈ ఆగ్రహానికి నిన్న ‘ఖార్క్ ద్వీపం’పై అమెరికా జరిపిన దాడే ప్రధాన కారణం. ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి ఖార్క్ ద్వీపాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా యుఏఈ ఓడరేవులను వాడుకుందని ఇరాన్ ఆరోపిస్తోంది. గల్ఫ్ దేశాలు తమ గడ్డపై అమెరికా సైన్యాన్ని అనుమతించకూడదని, ఒకవేళ అనుమతిస్తే కేవలం అమెరికా ఆస్తులే కాకుండా ఆ దేశాల సొంత ఆస్తులు కూడా ధ్వంసం చేయబడతాయని ఇరాన్ హెచ్చరించింది.
యుఏఈ ఆర్థిక వ్యవస్థపై ముప్పు: ఫుజైరాతో పాటు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) కూడా ఇరాన్ హిట్ లిస్టులో చేరింది. యుఏఈ చమురు ఉత్పత్తిలో మూడవ వంతు వాటా కలిగిన ఈ సంస్థ దెబ్బతింటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం యుఏఈలో భద్రతా కారణాల దృష్ట్యా జీపీఎస్ (GPS) సిగ్నల్స్‌ను నిలిపివేశారు. ఇరాన్ యొక్క ‘షాహెద్’ డ్రోన్లు జీపీఎస్ సాయంతో దాడులు చేయకుండా అడ్డుకోవడమే దీని లక్ష్యం. యుద్ధ భయంతో విదేశీ పెట్టుబడిదారులు, పర్యాటకులు దేశాన్ని వదిలి వెళ్తుండటంతో యుఏఈ వాణిజ్య రంగం తీవ్రంగా నష్టపోతోంది.
ఖార్క్ ద్వీపంపై దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న ఇరాన్, తన తదుపరి దాడులను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు మరియు ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని అంతర్జాతీయ సమాజం ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
