కర్ణాటక రాష్ట్రం మాండ్య ప్రాంతంలో నివసించే ఓ వృద్ధుడు, జీవితాంతం మసీదు ముందు భిక్షాటన చేస్తూ గడిపిన వార్త ప్రస్తుతం అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆదరణ లేని నిస్సహాయ స్థితిలో పేదరికంతో పోరాడిన ఆ వృద్ధుడు, తనకు దానంగా వచ్చిన స్వల్ప మొత్తాన్ని పైసా పైసా కూడబెట్టుకుంటూ వచ్చాడు. ఇటీవల ఆయన మరణించిన తర్వాత మసీదు నిర్వాహకులు అతని ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లినప్పుడు, ఆ చిన్న గుడిసెలో దాగి ఉన్న కోట్ల రూపాయల సంపదకు సంబంధించిన వింత నిజం వెలుగులోకి వచ్చింది.
ఇల్లంతా మూటలు మూటలుగా, సంచుల్లో దాచిన నోట్ల కట్టలను చూసి నిర్వాహకులు నివ్వెరపోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ డబ్బు విలువ రూ. 1 కోటికి పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ నగదును లెక్కించే పని కొనసాగుతోంది. భార్యాపిల్లలు ఎవరూ లేకపోవడంతో జీవితాంతం ఒంటరిగానే గడిపిన ఆ వృద్ధుడు, తన కోసం ఏమీ వాడుకోకుండా కోట్ల రూపాయల ధనాన్ని పోగుచేసి ఉంచడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
ఈ విషయంపై ఆయన సోదరులను సంప్రదించగా.. “ఈ డబ్బు మాది కాదు, మాకేమీ వద్దు.. దీన్ని ఆ మసీదుకే విరాళంగా ఇచ్చేయండి” అని వారు నిస్వార్థంగా చెప్పడం విశేషం. జీవితాంతం నిరుపేదగా జీవించి, మరణానంతరం కోటీశ్వరుడిగా వెలుగుచూసిన ఈ వృద్ధుడి కథ జీవితంలోని ఊహించని వింతలను, మనుషుల మనస్తత్వాలను స్పష్టంగా కళ్లకు కడుతోంది.

Leave a Reply