ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబీలో ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న తన ప్రేయసిని చూసేందుకు వెళ్లిన ఒక యువకుడిని, ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపేశారు. నిందితులు యువకుడిని చూడగానే విచక్షణారహితంగా దాడి చేసి రక్తమోడేలా కొట్టారు.
బాధిత యువకుడు ఎలాగోలా తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించి, ప్రాణాలతో కాపాడమని వేడుకున్నాడు. కానీ, ఆ క్రూరమైన నిందితులు ఫోన్‌ను లాక్కుని విసిరికొట్టి, సుమారు అరగంట పాటు ఆ యువకుడిపై దాడి చేస్తూనే ఉన్నారు. ఫోన్ కట్ అవ్వకపోవడంతో, తన కుమారుడిపై జరుగుతున్న అమానుషాన్ని తల్లి లైవ్ కాల్‌లోనే వింటూ షాక్‌కు గురైంది. వణుకుతున్న శరీరంతోనే ఆమె వెంటనే ఘటన స్థలానికి చేరుకుంది. అక్కడ తన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ప్రేయసి కుటుంబ సభ్యులు అప్పటికే రక్తపాతంతో ఉన్న యువకుడిని కొడుతూనే ఉన్నారు. తన కుమారుడిని కాపాడటానికి ప్రయత్నించిన తల్లిని కూడా వారు వదలకుండా కొట్టారు. చివరకు కళ్లముందే కుమారుడిని దారుణంగా చంపేశారు. ఈ ఘటనపై డయల్-112 ద్వారా పోలీసులకు సమాచారం అందగా, నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ఫోన్ కాల్‌తో మొదలైన విషాదం
అర్జలీపూర్ నివాసి అయిన మృతుడు శివ్ ప్రసాద్, గురువారం రాత్రి 11:49 గంటలకు తన తండ్రి రాంబదన్‌కు ఫోన్ చేశాడు. అర్ధరాత్రి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తండ్రి ఫోన్ ఎత్తగానే, శివ్ ప్రసాద్ బాధతో తల్లితో మాట్లాడాలని కోరాడు. ఫోన్ తల్లికి ఇవ్వగానే, కుమారుడు ఏడుస్తూ.. “అమ్మా, వచ్చి నన్ను కాపాడు.. నన్ను విపరీతంగా కొట్టారు, ఇప్పుడు చంపేస్తారు” అని వేడుకున్నాడు. ఫోన్ వెనుక నుండి ఎవరూ దారుణంగా దాడి చేస్తున్న శబ్దాలు, కేకలు వినిపించడంతో తల్లి ప్రాణాలు గాలిలో కలిశాయి. వెంటనే ఆమె ప్రేయసి ఇంటికి పరుగులు తీసింది. అక్కడ తన కుమారుడి తల, శరీరం నుండి రక్తం కారుతుండటం చూసి, ఎలాగైనా రక్షించాలని ప్రయత్నించిన తల్లిని కూడా నిందితులు కొట్టారు.
వరుసకు అత్త , మేనల్లుడు ?
‘దైనిక్ జాగరణ్’ నివేదిక ప్రకారం, ఈ ప్రేమికులు వరుసకు అత్తా-మేనల్లుడు అవుతారు. మంఝన్‌పూర్ కొత్వాలి ప్రాంతంలోని మహువా ఖాండా గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి, తన సోదరి బావమరిది కుమారుడితో 5 ఏళ్లుగా ప్రేమలో ఉంది. యువతి రెండు రోజులుగా అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొంది, గురువారం డిశ్చార్జ్ అయ్యింది. అదే రాత్రి శివ్ ప్రసాద్ ఆమెను చూసేందుకు వెళ్లగా, ఇద్దరు మాట్లాడుకుంటుండటం చూసిన కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. లాఠీలు, కర్రలతో యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మృతుడి మామ గంగా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు శివ్ ప్రసాద్‌ను పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు.
ఆసుపత్రికి వెళ్లే దారిలోనే ప్రాణాలు వదిలిన యువకుడు
తండ్రి రాంబదన్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికి శివ్ ప్రసాద్ ప్రాణాలతోనే ఉన్నాడు. అంబులెన్స్‌కు కాల్ చేసినా రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని బైక్‌పై ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే శివ్ ప్రసాద్ తుదిశ్వాస విడిచాడు. యువతి తండ్రి రాకేష్ రాజ్‌పుత్, తల్లి గెందియా అలియాస్ సుశీల, సోదరులు సచిన్, దుర్గేష్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో తండ్రి మరియు సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
