ఉద్యోగాలు, చదువుల కోసం సొంత ఊళ్లను వదిలి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న నేటి యువత జీవితంలో పీజీ (PG), షేరింగ్ రూమ్లు ముఖ్యమైన భాగంగా మారాయి.
సాధారణంగా పురుషుల గదులు శుభ్రంగా ఉండవని, వస్తువులు ఎక్కడపడితే అక్కడ పడి గందరగోళంగా ఉంటాయని సమాజంలో ఓ అభిప్రాయం ఉంది.
అయితే, అందుకు భిన్నంగా.. పీజీల్లో ఉంటున్న మహిళల గదులు కూడా ఎంత అస్తవ్యస్తంగా, అపరిశుభ్రంగా ఉంటాయో చూపిస్తూ ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. బయట ఎంతో శుభ్రంగా, చక్కగా కనిపించే మహిళలు తమ పీజీ గదుల్లో మాత్రం ఎంత అస్తవ్యస్తంగా ఉంటున్నారో ఆ యువకుడు చూపించాడు.
గదిలో బట్టలు ఎక్కడపడితే అక్కడ చెల్లాచెదురుగా ఉండటం, తిన్న ప్లేట్లను శుభ్రం చేయకుండా వదిలేయడం, గది మూలమూలల్లో చెత్త పేరుకుపోవడం వంటి దృశ్యాలు కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
పురుషుల కంటే మహిళలు పరిశుభ్రత విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపుతారనే సాధారణ అభిప్రాయాన్ని ఈ వీడియో ప్రశ్నిస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియోకు వేలాది వ్యూస్ రావడంతో వైరల్గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు రెండు వర్గాలుగా స్పందిస్తున్నారు.
ఒక వర్గం.. “పురుషుల గదులను మాత్రమే విమర్శించే వారికి, మహిళల గదుల్లోని పరిస్థితులను కూడా చూపించడం మంచిదే” అంటూ ఆ యువకుడికి మద్దతు ఇస్తున్నారు.
మరోవైపు.. “అందరు మహిళలు ఇలాగే ఉండరు. కొంతమంది నిర్లక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని మహిళలందరినీ అంచనా వేయకూడదు” అంటూ కొందరు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా, ఈ ఒక్క వీడియో.. నేటి యువత జీవనశైలి, పరిశుభ్రత అలవాట్లపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
