కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో, చికెన్ ముక్కల విషయమై తలెత్తిన వివాదంలో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపిన ఘోర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కర్ణాటకలోని బెళగావి జిల్లా హునాశ్యాల్ పీజీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పిలిభిత్ ప్రాంతానికి చెందిన సీతారామ్, అరుణ్ అనే ఇద్దరు వ్యక్తులు బెళగావిలోని ఒక స్టీల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ అదే ప్రాంతంలోని ఒక షెడ్డులో ఇతర కార్మికులతో కలిసి నివసిస్తున్నారు.
సంఘటన జరిగిన రోజు సెలవు కావడంతో, స్నేహితులంతా కలిసి మద్యం సేవించి వంట చేసుకుని భోజనానికి కూర్చున్నారు. ఆ సమయంలో భోజనం చేస్తూ, అరుణ్ తన ప్లేట్ కంటే ఎక్కువ చికెన్ ముక్కలు తిన్నాడని సీతారామ్ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య ప్రారంభమైన చిన్న వాగ్వాదం కాస్తా పెరిగి ఘర్షణకు దారితీసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన అరుణ్, అక్కడే ఉన్న కత్తిని తీసుకుని సీతారామ్ ఛాతీలో బలంగా పొడిచాడు.
తన స్నేహితుడు రక్తపు మడుగులో కిందపడిపోవడం చూసిన అరుణ్, వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాడు. అయితే తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి, సీతారామ్ భవనం పైనుంచి కింద పడిపోయాడంటూ ఆసుపత్రి సిబ్బంది వద్ద అబద్ధాలు ఆడి నాటకమాడాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అరుణ్ కుమార్‌ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో, చికెన్ ముక్కల గొడవలోనే స్నేహితుడిని కత్తితో పొడిచినట్లు అరుణ్ అంగీకరించాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారామ్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో అరుణ్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కాగా, గత ఏప్రిల్ నెలలో కేరళలోని పాలక్కాడ్‌లో కూడా చికెన్ కూర విషయంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తిని బంధువే హత్య చేసిన ఘటనను ఇక్కడ గుర్తుచేసుకోవచ్చు.

Leave a Reply