హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో, సంధ్యా శర్మ అనే ఉపాధ్యాయిని తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న సమయంలో, అమిత్ అనే యువకుడు పగటిపూట కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
భర్త పిలుస్తున్నారని అబద్ధం చెప్పి తరగతి గది నుండి బయటకు రప్పించి, దాచి ఉంచిన కత్తితో 27 సార్లకు పైగా విచక్షణారహితంగా పొడవడంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటన పాఠశాల సిసిటివి కెమెరాలో రికార్డవగా, కోట్ గ్రామానికి చెందిన అమిత్‌ను రెండు గంటల్లోనే పోలీసులు అరెస్టు చేసి, మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసుల విచారణలో, సంధ్యపై తనకు ఉన్న ఏకపక్ష ప్రేమను ఆమె తిరస్కరించడంతో ఆగ్రహించిన అమిత్, రెండు నెలల క్రితమే ప్లాన్ చేసి కత్తిని కొనుగోలు చేసి ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. అంతకుముందు అమిత్‌పై సంధ్య లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసినప్పటికీ, అమిత్ క్షమాపణలు కోరడంతో సంధ్య తన నివాసాన్ని, పాఠశాలను మార్చుకున్నారు. అయినప్పటికీ, పాఠశాలకు వెళ్లే మార్గంలో దాడి చేస్తే పట్టుబడతామనే భయంతో, నేరుగా పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది.
మరణించిన సంధ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమిత్‌పై ముందే లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే, తన భార్య ప్రాణాలు దక్కేవని సంధ్య భర్త వేదనతో తెలిపారు. అరెస్ట్ అయిన అమిత్ నుండి హత్యకు ఉపయోగించిన కత్తి మరియు వాహనాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ జరుగుతుండగా, ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply