బీహార్ రాష్ట్రంలోని సుపౌల్ జిల్లాలోని ఒక అంగన్వాడీ కేంద్రంలో 3 ఏళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. రియాన్ష్ కుమార్ అనే బాలుడిని ఉదయం అతడి తల్లి అంగన్వాడీ కేంద్రంలో విడిచిపెట్టగా, కొద్దిసేపటికే అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్పృహతప్పి పడిపోయిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో బాలుడి తల్లి గౌరీ దేవి అంగన్వాడీ కేంద్రంలో ఒక జర్మన్ షెపర్డ్ కుక్కను కట్టేసి ఉంచుతారని, ఏడ్చే పిల్లలను ఆ కుక్కను చూపి భయపెట్టేవారని ఆరోపించారు. ఘటన జరిగిన రోజున కూడా తన కుమారుడిని కుక్కను చూపి భయపెట్టారని, ఆ తర్వాతే అతడి ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడని ఆమె తెలిపారు. అయితే, అంగన్వాడీ కార్యకర్త ముని కుమారి ఈ ఆరోపణలను ఖండించారు. బాలుడు ఏడుస్తుండటంతో అతడిని ఊరడించేందుకు పల్లీలు (వేరుశనగలు) ఇచ్చానని, కొద్దిసేపటికే అతడు హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయాడని ఆమె చెప్పారు.
బాలుడు స్పృహతప్పి పడిపోగానే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సుపౌల్ జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి పథకం అధికారి (ICDS Officer) అంజు కుమారి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. బాలుడు ఏడుస్తుండటంతో ఊరడించేందుకు ప్రయత్నించిన సమయంలోనే అతడి ఆరోగ్యం క్షీణించిందని ఆమె తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో కుక్క ఉందన్న వార్తలపై కూడా విచారణ జరుపుతున్నామని, ఇప్పటివరకు అక్కడ కుక్క ఉన్నట్లు నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, బాలుడు కుక్క మొరగడంతో భయపడ్డాడని, దానివల్లే ఆరోగ్యం క్షీణించి ఉండవచ్చని ప్రాథమిక పోలీస్ విచారణలో తెలిసింది. అయితే ఇది కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమేనని, బాలుడి మృతికి అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. తల్లి ఆరోపణలు, అంగన్వాడీ కార్యకర్త వివరణ, అధికారుల దర్యాప్తు ఇలా అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది. విచారణలో ఎవరి నిర్లక్ష్యం లేదా తప్పు ఉన్నట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply