భారతీయ రైల్వేకి ఆధునిక గుర్తింపుగా, వేగవంతమైన ప్రయాణానికి ప్రతీకగా నిలిచిన ‘వందే భారత్’ రైలులో కొందరు ప్రయాణికులు చేసిన బాధ్యతారాహిత్య చర్య సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతోంది.
ప్రారంభంలో ప్రపంచ స్థాయి సీట్లు, మిలమిల మెరిసే పరిశుభ్రతతో ఎంతో అద్భుతంగా అనిపించిన ఆ రైలు లోపలి భాగం, ప్రయాణం ముగిసేసరికి చెత్తకుప్పగా మారిన దారుణ దృశ్యం నెట్టింట ప్రత్యక్షమై ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రయాణ సమయంలో తిన్న పదార్థాల అనంతరం ప్రయాణికులు.. ప్లాస్టిక్ సీసాలు, ఆహార పొట్లాలు, కాగితాలు మరియు వ్యర్థాలను సీట్ల కింద, నడిచే దారుల్లో ఇష్టారాజ్యంగా పారేసి వెళ్లారు.
చెత్తబుట్టల (Dustbins) సౌకర్యం ఉన్నప్పటికీ, దానిని ఏమాత్రం పట్టించుకోకుండా అత్యాధునిక వసతులు ఉన్న వందే భారత్ రైలును ఇలా అపరిశుభ్రంగా మార్చడం అందరినీ వేదనకు గురిచేసింది. స్వీపర్లు వచ్చి ఆ చెత్తను శుభ్రం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు పలువురు తమ కోపాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మనకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించినా, వాటిని శుభ్రంగా పాడుచేయకుండా ఉంచుకునే కనీస నాగరికత కూడా లేదే!’ అని నెటిజన్లు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply