కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాకు చెందిన 67 ఏళ్ల మాజీ సైనిక ఉద్యోగి రుద్రప్ప కుండర్గి, తన కుటుంబంతో కలిసి ధార్వాడ్లో నివసిస్తున్నారు. ఆయన తన 38 గుంటల భూమికి సంబంధించిన పత్రాలను సరిచూసుకోవడానికి, తన పేరును నమోదు చేసుకోవడానికి తన 26 ఏళ్ల కుమార్తె శశికళతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చారు.
గతంలోనే ఈ 38 గుంటల భూమిని ముగ్గురు సోదరులకు సమానంగా పంచాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే రుద్రప్ప ఊరు వదిలి వెళ్ళిపోయారని చెప్తూ, ఆయన సోదరులైన బసప్ప, సంగప్పలు ఆయనకు భూమిలో వాటా ఇవ్వడానికి నిరాకరించడంతో వారి మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది.
సంఘటన జరిగిన రోజు పంచాయతీ కార్యాలయంలో పత్రాలను సరిచూస్తుండగా, అక్కడికి వచ్చిన రుద్రప్ప సోదరులు, అల్లుడు మడివాళప్ప ఆయనతో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దది కావడంతో ఆగ్రహం చెందిన ఆ మూక పదునైన ఆయుధాలతో రుద్రప్పపై విచక్షణారహితంగా దాడి చేసింది.
తండ్రిని రక్షించడానికి పరిగెత్తుకొచ్చిన కుమార్తె శశికళపై కూడా ఆ మూక దయలేకుండా దాడి చేసింది. శశికళ తలపై రాయి కొట్టి, జుట్టు కోసి అతి క్రూరంగా హింసించి చంపేశారు. ఈ ఘోరంలో తండ్రీకూతుళ్లు పంచాయతీ అధికారుల కళ్లముందే రక్తం మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలోనే జరిగిన ఈ దాడిలో రుద్రప్ప డ్రైవర్, కుమార్తె స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ హత్యను అక్కడే ఉన్న సిబ్బంది వీడియో తీశారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply