మెక్సికో: మెక్సికోలో వరుసగా జరుగుతున్న బైక్ దొంగతనాలతో విసిగిపోయిన ఒక వ్యక్తి, కామిక్స్ కథల్లోని ‘బ్యాట్‌మ్యాన్’లా మారిపోయాడు. ఆ దొంగలను వెతికి పట్టుకోవడమే కాకుండా, వారిని స్తంభాలకు కట్టేసి వింతైన రీతిలో శిక్షలు విధిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి.
పట్టుబడిన దొంగలను అతడు టేపులతో స్తంభానికి గట్టిగా కట్టేస్తున్నాడు. అంతేకాదు, వారి ఒంటిపై “నేను ఒక దొంగను” అని రాసి, బ్యాట్‌మ్యాన్ కథల్లోని విలన్ ‘జోకర్’లా వారి ముఖాలకు రంగులు పూస్తున్నాడు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని అతను చేస్తున్న ఈ పనులు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయి.
ఈ వీడియోలను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అతన్ని “నిజమైన హీరో” అని, పోలీసులు చేయలేని పనిని ఇతడు చేస్తున్నాడని ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదని, ఇది హింసకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
