“అయ్యో మోసగాళ్లారా! ₹11 లక్షలిస్తే ₹15 కోట్ల ధన వర్షం కురుస్తుందా..?” దొంగ బాబా మాటలు నమ్మి నడిరోడ్డున పడ్డ కుటుంబం.. వెన్నులో వణుకు పుట్టించే నిజాలు..!!

మహారాష్ట్రలో ‘క్షుద్ర పూజలు, తంత్ర విద్యల ద్వారా ₹11 లక్షలు ఇస్తే ఏకంగా ₹15 కోట్ల ధన వర్షం కురిపిస్తాను’ అంటూ అమాయకులను నిలువునా ముంచిన ఓ దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబైకి చెందిన ఓ కుటుంబాన్ని మాయమాటలతో నమ్మించి మోసం చేసిన హీరాచంద్ పార్ధేతో పాటు అతని ఆరుగురు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.

ప్రారంభంలో ఆ కుటుంబం నుంచి ₹1,000 తీసుకుని, చేతివాటం జిమ్మిక్కులతో దానిని ₹2 లక్షలుగా మార్చి చూపించి ఈ మోసగాడు వారి నమ్మకాన్ని చూరగొన్నాడు. ఆ తర్వాత కొబ్బరికాయను పగలగొట్టి ఏవో అతీంద్రియ శక్తులు, అద్భుతాలు జరుగుతున్నట్లు నమ్మించి.. బాధితుల వద్ద నుంచి దశలవారీగా ఏకంగా ₹10 లక్షల 55 వేలు కాజేశాడు.

అనంతరం, ₹3 కోట్ల నగదుతో కూడిన మూటలు సిద్ధమయ్యాయని చెప్పి కొన్ని గోనె సంచులను వారికి అప్పగించాడు. అయితే, ఆ మూటలను రాబోయే 7 రోజుల పాటు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవకూడదని, పొరపాటున తెరిస్తే ప్రాణాలకే ప్రమాదమని భయపెట్టి నమ్మించాడు.

ఏడు రోజుల తర్వాత బాధితులు భయంభయంగా ఆ మూటలను తెరిచి చూడగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నోట్ల కట్టల పైభాగంలో మాత్రమే అసలు నోట్లను ఉంచి, లోపలంతా దొంగ నోట్లు, తెల్ల కాగితాలు కుక్కి మోసం చేసినట్లు బట్టబయలైంది.

తాము మోసపోయామని గ్రహించిన ఆ కుటుంబం తమ డబ్బులను తిరిగి ఇవ్వాలని నిలదీయగా, వారిని చంపేస్తానని సదరు బాబా బెదిరింపులకు దిగాడు. దీంతో ప్రాణభయంతో వణికిపోయిన బాధితులు మహారాష్ట్రలోని ప్రముఖ మూఢనమ్మకాల వ్యతిరేక సంస్థ ‘అన్వీస్’ (ANiS – అంధశ్రద్ధా నిర్మూలన సమితి)ను ఆశ్రయించారు. వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు ఈ మోసగాళ్ల ముఠాను కటకటాల్లోకి నెట్టారు.


Posted

in

by

Tags: