హౌరా రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కేందుకు పరుగున వచ్చిన ఓ ప్రయాణికుడు, రైలు తలుపులు ఆటోమేటిక్‌గా మూసుకుపోవడంతో లోపలికి వెళ్లలేక తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
రైలు నెమ్మదిగా కదలడం ప్రారంభించడంతో ఏం చేయాలో పాలుపోక ఆ ప్రయాణికుడు దిక్కుతోచని స్థితిలో ఉండగా, అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ వెంటనే స్పందించి ఆదుకున్నాడు.
రైలు అప్పటికే బయలుదేరిపోయింది కాబట్టి ఏమీ చేయలేమని వదిలేయకుండా, ఆ ఆర్పీఎఫ్ జవాను రైలు ఇంజిన్ వైపు లోకో పైలట్ (డ్రైవర్) క్యాబిన్ దిశగా వేగంగా పరుగెత్తాడు. పరిస్థితిని గమనించిన లోకో పైలట్‌కు సైగలు చేసి రైలును ఆపాలని సూచించగా, డ్రైవర్ ఆ సైగలను అర్థం చేసుకుని వెంటనే రైలును ఆపేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో, ప్రయాణికులు రైలు సమయాలను ముందే గమనించుకుని సమయానికి స్టేషన్‌కు రావాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు.
వందే భారత్ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆటోమేటిక్ డోర్లను ఏర్పాటు చేశారు. రైలు కదలడం ప్రారంభించగానే మూసుకుపోయే ఈ తలుపులు, రైలు పూర్తిగా ఆగిన తర్వాతే తిరిగి తెరుచుకుంటాయన్న విషయం గమనార్హం.

Leave a Reply