ఖతార్ దేశ రాజధాని దోహాకు విచ్చేసిన అల్జీరియన్-ఫ్రెంచ్ సోషల్ మీడియా సెలబ్రిటీ ‘రిమా’, అక్కడి సంస్కృతి, నిబంధనలకు విరుద్ధంగా అరకొర దుస్తులతో అంగాంగ ప్రదర్శన చేస్తూ వీడియోలను పోస్ట్ చేయడంతో.. ఖతార్ అధికారులు ఆమెను తక్షణమే దేశం నుండి బహిష్కరించారు . ఖతార్‌లోని ప్రజా నైతికత (పబ్లిక్ డెసిన్సీ) నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకే ఈ కఠిన చర్య తీసుకున్నారు.
దోహాకు చేరుకున్న కొన్ని రోజులకే రిమా, తన సోషల్ మీడియా ఖాతాలలో అరకొర దుస్తులతో ఉన్న ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. అంతేకాకుండా, ఆ సమయంలో ఖతార్ దేశం అధికారికంగా సంతాప దినాలను పాటిస్తున్నప్పటికీ, దేశ సంస్కృతిని గౌరవించకుండా ఆమె ఇలాంటి వీడియోలను విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.
దీనిపై ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న ఖతార్ అధికారులు, రెండు రోజుల విచారణ అనంతరం ఆమెను దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన రిమా, తాను 2 రోజులు కస్టడీలో ఉన్న విషయాన్ని ఖరారు చేయడంతో పాటు, తన బహిష్కరణ (డిపోర్టేషన్) పత్రాలను కూడా బయటపెట్టింది.
ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ, “నేను ముస్లిం అయినప్పటికీ, ఇస్లామిక్ మార్గదర్శకాలను పూర్తిగా పాటించడంలో విఫలమయ్యాను. భవిష్యత్తులో నా నమ్మకాన్ని బలంగా పాటిస్తూ మళ్లీ ఖతార్‌కు తిరిగి వస్తాను” అని పేర్కొంది. ఇస్లామిక్ సంస్కృతిని, ప్రజా శాంతిని కఠినంగా అమలు చేసే ఖతార్ ప్రభుత్వ ఈ చర్య, ప్రస్తుతం ఇంటర్నెట్ వేదికగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది.
