నేటి తరం యువత అయిన ‘జెన్-జీ’ (Gen-Z) వర్గంలో ‘ఫేక్ వెడ్డింగ్’ (నకిలీ పెళ్లిళ్లు) అనే సరికొత్త సంబరాల ట్రెండ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సాధారణంగా పెళ్లి అంటేనే పెళ్లికొడుకు, పెళ్లికూతురు, బంధుమిత్రుల హడావుడి కనిపిస్తుంది. కానీ, ఎలాంటి వధూవరులు లేకుండా జరుపుకునే ఈ విచిత్రమైన వేడుకే ఇప్పుడు యువతకు సరికొత్త క్రేజ్గా మారింది.
ఈ నకిలీ వివాహ వేడుకల్లో అచ్చం నిజమైన పెళ్లి తరహాలోనే అట్టహాసమైన డెకరేషన్లు, రకరకాల విందు భోజనాలు, పాటలు, డ్యాన్సులు వంటి అన్ని హంగులూ ఉంటాయి. అయితే ఇందులో పెళ్లికుమారుడు కానీ పెళ్లికుమార్తె కానీ అస్సలు ఉండరు. యువత అంతా ఒకచోట చేరి, సంగీతానికి అనుగుణంగా చిందులేస్తూ, నోరూరించే వంటకాలను ఆస్వాదిస్తూ ఈ ఈవెంట్ను ఓ పండుగలా జరుపుకుంటారు.
నిజమైన పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు “ఇంతకీ నీ పెళ్లెప్పుడు?” అంటూ బంధువులు అడిగే ప్రశ్నలకు భయపడి చాలామంది యువతీయువకులు శుభకార్యాలకు వెళ్లడమే మానేస్తున్నారు. అయితే ఈ ‘ఫేక్ మ్యారేజ్’లలో చుట్టాల పోరు గానీ, సామాజిక ఒత్తిళ్లు గానీ ఉండవు. దాంతో ఎలాంటి మానసిక ఆందోళనలు లేకుండా కుర్రకారు ఎంచక్కా స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తున్నారు.
అంతేకాకుండా, ట్రెడిషనల్ దుస్తులు ధరించి ముస్తాబు కావాలని కోరుకునేవారికి ఇది ఒక మంచి అవకాశంగా మారింది. ఎవరో ఒకరి పెళ్లి వచ్చేదాకా వేచి చూడాల్సిన పనిలేకుండా, తాము కోరుకున్న సమయంలో నచ్చిన సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ మురిసిపోవడానికి ఈ వేడుకలు ఉపయోగపడుతున్నాయి.
ప్రస్తుతం ఈ ‘ఫేక్ వెడ్డింగ్’ సంస్కృతి కేవలం సరదా వేడుకగానే కాకుండా.. ఫ్యాషన్, డిజిటల్ కంటెంట్ రంగాల్లో ఒక సరికొత్త వ్యాపార అవకాశంగా కూడా రూపుదిద్దుకుంటోంది. ఎలాంటి ఒత్తిళ్లు లేని ఈ సరికొత్త సరదా ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతను విశేషంగా ఆకర్షిస్తూ నెట్టింట హల్చల్ చేస్తోంది.
