సోషల్ మీడియాలో ప్రస్తుతం లండన్‌కు చెందిన ఒక విచిత్రమైన ఉద్యోగ ప్రకటన హాట్ టాపిక్‌గా వైరల్ అవుతోంది.
పైకి చూడ్డానికి ఇది ఏదో సాధారణ లాండ్రీ పనిలా అనిపించినప్పటికీ, దీనికి ఇచ్చే వార్షిక వేతనం దాదాపు రూ.90 లక్షలు (దాదాపు 80,000 పౌండ్లు) కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బ్రిటన్‌కు చెందిన ‘ది లేడీ’ పత్రిక మరియు ‘బ్యూచాంప్ పార్ట్‌నర్స్’ ఏజెన్సీ విడుదల చేసిన ఈ జాబ్ నోటిఫికేషన్ వినడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నా, దీని వెనుక ఉన్న నిబంధనలు మాత్రం అత్యంత కఠినమైనవి.
ఇది మామూలు లాండ్రీ పని కాదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, సున్నితమైన డిజైనర్ దుస్తులను ఎలా సంరక్షించాలి? వేటిని ఎలా వాష్ చేయాలి? ఎలా డ్రై చేయాలి? వాటిని ఎలా భద్రపరచాలి? అనే విషయాల్లో నిపుణుడై ఉండాలి. చిన్న పొరపాటు జరిగినా లక్షల రూపాయల విలువైన కాస్ట్‌లీ దుస్తులు పాడైపోయే ప్రమాదం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
అయితే ఈ పని కేవలం బట్టలు ఉతకడంతోనే ముగిసిపోదు; దీనిలో ఇంకా చాలా కీలక బాధ్యతలు ఉన్నాయి. యజమాని యొక్క లగ్జరీ కార్లను డ్రైవ్ చేయాలి. వారిని సురక్షితంగా మీటింగ్‌లకు, ఈవెంట్లకు తీసుకెళ్లడంతో పాటు కార్లను జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి.
యజమాని ఇంట్లో జరిగే హై-ప్రొఫైల్ పార్టీలను వీరే ముందుండి నడిపించాలి. వీఐపీ అతిథుల బాగోగులు చూసుకోవడం, ఇంటి నిర్వహణను పర్యవేక్షించడం ఈ ఉద్యోగంలో ప్రధాన భాగం. ఈ ఇంటి యజమాని ఏడాదిలో కేవలం 90 రోజులు మాత్రమే లండన్‌లో ఉంటారట; మిగిలిన రోజంతా ప్రపంచ యాత్రల్లోనే గడుపుతారు. కాబట్టి మీరు కూడా వారితో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. దీనివల్ల ఫిక్స్‌డ్ పని గంటలు అంటూ ఏమీ ఉండవు; 24 గంటలూ ఏ పనికైనా సిద్ధంగా ఉండాలి.
ఈ రూ.90 లక్షల వార్షిక ప్యాకేజీ అనేది కేవలం లాండ్రీ కోసం మాత్రమే కాదు. ఒకే వ్యక్తి డ్రైవర్, లాండ్రీ ఎక్స్‌పర్ట్, ఈవెంట్ ఆర్గనైజర్, కేర్ టేకర్ మరియు పర్సనల్ అసిస్టెంట్‌గా అన్ని బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.
వీటన్నింటికీ మించి ఇందులో ఉన్న అతిపెద్ద కఠిన నిబంధన ఏమిటంటే… యజమాని వ్యక్తిగత జీవితం, ప్రైవసీకి సంబంధించిన ఎలాంటి రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పొక్కనివ్వకూడదు; నూటికి నూరు శాతం అత్యంత గోప్యతను పాటించాలి!

Leave a Reply