తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ న్యూ టౌన్ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఓ ఆటో వేగంగా వెళ్తున్నట్లు స్థానికులు గుర్తించారు.
ఆ సమయంలో ఆటోలో ఉన్న కొందరు వ్యక్తులు ఓ వస్తువును రోడ్డుపైకి విసిరేసి, వేగంగా అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. కొద్దిసేపటి తర్వాత అదే మార్గంలో వెళ్తున్న కొందరు యువకులకు రోడ్డుపక్క నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది.
వారు అక్కడికి వెళ్లి చూడగా, ఓ పసికందును శాలువా, చిన్న పరుపులో చుట్టి రోడ్డుపై వదిలేసి ఉన్నట్లు గుర్తించారు. ఈ దృశ్యాన్ని చూసి షాక్కు గురైన యువకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం చిన్నారి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రికి చేరుకున్నారు. “ఆ చిన్నారిని మేమే పెంచుకుంటాం” అంటూ పలువురు ముందుకు వచ్చినట్లు సమాచారం.
చిన్నారిని దత్తత తీసుకోవాలనుకునే వారు జిల్లా శిశు సంక్షేమ అధికారులను సంప్రదించాలని వైద్యులు సూచించారు.
ఇక చిన్నారిని ఆటోలో తీసుకొచ్చి రోడ్డుపై వదిలేసి వెళ్లిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

Leave a Reply