రాజస్థాన్లోని బార్మేర్లో అర్థరాత్రి ప్రియురాలిని కలవడానికి వెళ్లిన యువకుడిని గ్రామస్థులు బంధించి, చెట్టుకు కట్టేసి అమానవీయంగా ప్రవర్తించారు. ప్రియురాలి కళ్ల ముందే యువకుడి జుట్టు, గడ్డం, మీసాలు, కనుబొమ్మలను కత్తిరించారు. 5 గంటల పాటు అతడిని చిత్రహింసలకు గురి చేసిన వీడియో వైరల్ కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
రాజస్థాన్ బార్మేర్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి తన ప్రేయసిని కలవడానికి వచ్చిన యువకుడిని గ్రామస్థులు పట్టుకుని దారుణంగా కొట్టారు.
30 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాడు: ఈ ఘటన మే 12వ తేదీ రాత్రి జరిగినట్లు సమాచారం. బాధితుడు తన ప్రియురాలిని కలవడానికి దాదాపు 30-32 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆమె గ్రామానికి వచ్చాడు. రాత్రి 1:00 గంట సమయంలో ఇద్దరూ గ్రామం వెలుపల మాట్లాడుకుంటుండగా, యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు విషయం తెలిసింది.
ప్రియురాలు ప్రాధేయపడినా.. గ్రామస్థులు ఇద్దరినీ పట్టుకుని, యువకుడిని బలవంతంగా తీసుకెళ్లి తాళ్లతో కట్టేసారు. అక్కడే ఉన్న ప్రియురాలు కన్నీరు మున్నీరవుతూ, చేతులు జోడించి వదిలేయమని వేడుకున్నా గ్రామస్థులు కనికరించలేదు. కత్తెర తీసుకువచ్చి, ఆమె కళ్ల ముందే యువకుడి జుట్టు, గడ్డం, మీసాలు, కనుబొమ్మలను కత్తిరించారు.
5 గంటల పాటు హింస, వీడియో వైరల్: యువకుడిని చెట్టుకు కట్టి దాదాపు 4 నుండి 5 గంటల పాటు నిరంతరం చిత్రహింసలకు గురిచేశారు. కొందరు ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మరుసటి రోజు ఉదయం 6:00 గంటలకు అతడిని వదిలేయగా, భయంతో వణికిపోతూ బాధితుడు తన గ్రామానికి వెళ్లిపోయాడు.
వీడియో వైరల్ కావడంతో బార్మేర్ సదర్ పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా యువతీయువకులను గుర్తించి, విచారణ కోసం పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఇప్పటివరకు ఎవరూ లిఖితపూర్వక ఫిర్యాదు చేయకపోయినప్పటికీ, పోలీసులు తమంతట తామే ఈ కేసులో విచారణ జరుపుతున్నారు.
