మహిళా హాస్టళ్లలో తమ పిల్లల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదనే నమ్మకంతో వేలాది మంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను అక్కడ ఉంచుతున్నారు.
కానీ, అదే హాస్టల్ బాధ్యతలు చూసుకోవాల్సిన వార్డెనే విద్యార్థినుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా దారుణానికి ఒడిగట్టిన ఘటన తీవ్ర కలకలం, దిగ్భ్రాంతిని రేకెత్తించింది.
రాత్రి సమయంలో బాత్రూమ్కు వెళ్లిన ఓ విద్యార్థిని, పైకప్పుపై కెమెరా ఆన్ చేసి పెట్టిన మొబైల్ ఫోన్‌ను చూసి భయాందోళనకు గురికావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రాత్రి వేళ ఎప్పటిలాగే హాస్టల్ వాష్‌రూమ్‌కు వెళ్లిన ఆ విద్యార్థిని, అనుకోకుండా పైకి చూడగా సీలింగ్ మూలలో ఏదో మెరుస్తున్న వెలుగు కనిపించింది.
అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా, అక్కడ ఓ మొబైల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డింగ్ అవుతున్నట్లు గుర్తించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువతి వెంటనే బయటకు పరుగులు తీసి, తోటి విద్యార్థినులకు, తల్లిదండ్రులకు మరియు యాజమాన్యానికి సమాచారం అందించింది.
ఈ విషయమై హాస్టల్ వార్డెన్‌ను నిలదీయగా.. “వాష్‌రూమ్‌లో ఎవరైనా సిగరెట్లు లేదా నిషేధిత వస్తువులు వాడుతున్నారా, అలాగే పారిశుద్ధ్య సామాగ్రి సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయడానికే కెమెరా పెట్టాను” అంటూ అత్యంత నిర్లక్ష్యపు, అర్థం లేని సమాధానం చెప్పాడు.
వార్డెన్ చెప్పిన ఈ బుద్ధిలేని, అసభ్యకరమైన వివరణతో ఆగ్రహించిన విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హాస్టల్ ఎదుట బైఠాయించి రాత్రంతా నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, వాష్‌రూమ్‌లో రహస్యంగా అమర్చిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వికృత చేష్టలకు పాల్పడిన వార్డెన్‌ను అరెస్టు చేసి సమగ్ర విచారణ ప్రారంభించారు.
మహిళా హాస్టళ్లలోనే ఇలాంటి భద్రతా లోపాలు, వ్యక్తిగత గోప్యత హరణం జరగడం తల్లిదండ్రుల్లో, ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను కలిగిస్తోంది.
