అర్హత ఉన్నప్పటికీ తదుపరి రెండు అండర్-19 ప్రపంచకప్‌లలో వైభవ్ సూర్యవంశీ ఎందుకు ఆడలేరు? దీని వెనుక ఉన్న ‘రాహుల్ ద్రవిడ్’ ?

ఇటీవల ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి, భారత్ తన 6వ అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ క్రమంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అతి పిన్న వయసులో ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఫైనల్‌లో అతను చేసిన 175 పరుగులు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి.

కేవలం 14 ఏళ్లకే ఐపీఎల్ కోటీశ్వరుడిగా మారడం, సెంచరీ బాదడం వంటి ఎన్నో రికార్డులు సృష్టించిన వైభవ్, రాబోయే 2028 మరియు 2030 ప్రపంచకప్‌ల సమయానికి వరుసగా 16, 18 ఏళ్ల వయసులో ఉంటాడు. అంటే నిబంధనల ప్రకారం అతనికి ఆడే వయసు ఉన్నప్పటికీ, అతను మళ్ళీ అండర్-19 జట్టులో కనిపించడు. దానికి కారణం ఫామ్ లేదా ఎంపిక కాదు, బీసీసీఐ (BCCI) యొక్క కఠిన నిబంధనలు.

ఒక్కసారి మాత్రమే అవకాశం: 2016 నుండి బీసీసీఐ ఒక నిబంధనను అమలు చేస్తోంది. దీని ప్రకారం ఒక భారతీయ క్రికెటర్ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొనాలి. వయసు మళ్ళించిన సర్టిఫికేట్లతో (Age-fudging) జూనియర్ క్రికెట్‌లో జరిగే మోసాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాహుల్ ద్రవిడ్ ఏమన్నారంటే: మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఈ అంశంపై గతంలోనే గట్టిగా స్పందించారు. “పిల్లల తల్లిదండ్రులు లేదా కోచ్‌లు ఫేక్ సర్టిఫికేట్లతో మోసం చేయడం నేర్పిస్తే, ఆ పిల్లవాడు భవిష్యత్తులో అవినీతికి పాల్పడకుండా ఉంటాడా? 14 ఏళ్ల వయసులో వయసును దాచడం, 25 ఏళ్ల వయసులో ఫిక్సింగ్‌కు పాల్పడటం.. రెండూ మోసమే” అని ఆయన హెచ్చరించారు. అందుకే, గెలిచినా ఓడినా కుర్రాళ్లకు ఒక్క అవకాశమే ఇచ్చి, వారిని తదుపరి స్థాయికి (సీనియర్ టీమ్) సిద్ధం చేయాలనేది బోర్డు ఉద్దేశం.


Posted

in

by

Tags: