సాధారణంగా న్యాయమూర్తులకు చాలా సెలవులు ఉంటాయని, పని తక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ వాస్తవం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. న్యాయవ్యవస్థపై ఎంతటి పనిభారం ఉందో గతంలో మాజీ సీజేఐలతో సహా పలువురు న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
తాజాగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ విద్యార్థి తన ఉత్తర్వుల్లో ఒక రోజులో అనేక కేసులను పరిష్కరించడం న్యాయమూర్తికి ఎంత అలసటను కలిగిస్తుందో వివరించారు. తాను బాగా అలసిపోయానని, ఆకలిగా ఉందని పేర్కొంటూ ఆయన ఒక కేసు తీర్పును రిజర్వ్ (నిలిపివేత) చేశారు.
ఏం జరిగింది?
‘బార్ అండ్ బెంచ్’ కథనం ప్రకారం.. ఫిబ్రవరి 24న డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) కు సంబంధించిన ఒక కేసు విచారణను పూర్తి చేసిన జస్టిస్ సుభాష్ విద్యార్థి తీర్పును రిజర్వ్ చేశారు. ఆ సమయంలో ఆయన తన ఉత్తర్వుల్లో ఇలా రాశారు:
“నాకు ఆకలిగా ఉంది, నేను చాలా అలసిపోయాను. శారీరక శ్రమ కారణంగా ఇప్పుడు తీర్పును వెలువరించలేకపోతున్నాను. అందుకే తీర్పును రిజర్వ్ చేస్తున్నాను.”
ఆ రోజు సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమైన ఈ కేసు విచారణ రాత్రి 7:10 గంటల వరకు కొనసాగింది. కోర్టు పనివేళలు ముగిసినప్పటికీ, కేసు ప్రాముఖ్యత దృష్ట్యా ఆయన విచారణను కొనసాగించారు.
సుప్రీంకోర్టు ఆదేశమే కారణం
నిజానికి, ఈ కేసు విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. ఆ ఆరు నెలల గడువు ఫిబ్రవరి 24తో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ, నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయడానికి జస్టిస్ సుభాష్ విద్యార్థి రాత్రి వరకు శ్రమించారు.
సెలవులపై చర్చ
న్యాయస్థానాల్లో సెలవులపై తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. గత ఏడాది మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఈ విషయంపై స్పందిస్తూ.. సుప్రీంకోర్టులో ఎక్కువ సెలవులు ఉంటాయనే విమర్శ పూర్తిగా నిరాధారమని అన్నారు. న్యాయమూర్తులు ఏడాదిలో 365 రోజులు, 24 గంటలు పని చేస్తూనే ఉంటారని, ప్రపంచంలోనే అత్యధిక పని దినాలు కలిగిన టాప్ కోర్టులలో భారత సుప్రీంకోర్టు ఒకటి అని ఆయన స్పష్టం చేశారు.
