పాకిస్థాన్ క్రికెట్ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించింది. కానీ నేడు.. పతనం అంచున నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో అవమానకర ఓటమి, ఇప్పుడు సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడం పాక్ అభిమానుల గుండెలను పిండేస్తోంది. ఈ దారుణ పరిస్థితులపై పాక్ మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రిది నిప్పులు చెరిగారు. ఎంతలా అంటే.. ప్రస్తుతం వన్డే జట్టుకు సారథ్యం వహిస్తున్నది తన సొంత అల్లుడు షహీన్ అఫ్రిది అని కూడా చూడకుండా, వ్యవస్థలోని లోపాలపై గళమెత్తారు.
ఎవరికి పట్టం కట్టాలో కూడా తెలియదా?
“పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఇంతటి దయనీయ స్థితిని నేను ఎప్పుడూ చూడలేదు” అంటూ అఫ్రిది ఆవేదన వ్యక్తం చేశారు. సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడుతూ.. “అసలు ఎవరికి ఏ ఫార్మాట్ కెప్టెన్సీ ఇవ్వాలో కూడా తెలియని అయోమయంలో సెలక్టర్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న సభ్యులు కమిటీలో ఉండి కూడా ఇలాంటి దిక్కుమాలిన నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు? కేవలం రెండు మూడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కుర్రాళ్లను తెచ్చి జాతీయ జట్టులో పడేస్తే.. వారు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి ఆడతారే తప్ప, దేశం కోసం ఎలా ఆడతారు?” అని నిలదీశారు.
అది క్రికెటా.. ప్రయోగశాలా?
జట్టులో మార్పుల పేరిట చేస్తున్న ప్రయోగాలను అఫ్రిది తీవ్రంగా తప్పుబట్టారు. “వన్డేల్లో అద్భుతమైన రికార్డులు ఉన్న ఆటగాళ్లను, టీ20 ప్రదర్శన బాగాలేదని పక్కన పెట్టడం ఏ రకమైన తెలివితేటలు? బాబర్ అజామ్ వంటి నాణ్యమైన బ్యాటర్‌ను పక్కన పెట్టి మీరు సాధించేదేమిటి? నిజానికి ఇప్పుడు చికిత్స కావాల్సింది ఆటగాళ్లకు కాదు.. ఆఫీసుల్లో కూర్చుని అర్థం లేని నిర్ణయాలు తీసుకుంటున్న సెలక్షన్ కమిటీకి!” అని ఎద్దేవా చేశారు.
అల్లుడు సారథి అయినా.. దేశమే ముఖ్యం!
ఈ విమర్శల్లో విశేషమేమిటంటే, ప్రస్తుతం జట్టుకు నాయకత్వం వహిస్తున్న షహీన్ అఫ్రిది స్వయానా షాహిద్ అల్లుడు. అయినప్పటికీ, పాక్ క్రికెట్ పట్ల తనకున్న ప్రేమ ముందు బంధుత్వం చిన్నబోయింది. “దేశవాళీ వ్యవస్థ కుప్పకూలిపోయింది. నాణ్యమైన ఆటగాళ్లను అందించలేకపోతోంది. ఇలాగే ఉంటే ప్రతి టోర్నీలోనూ ఓడిపోవడం మనకు అలవాటుగా మారిపోతుంది. అభిమానుల ఆశలను, ఆవేదనను ఇకనైనా అర్థం చేసుకోండి” అని అఫ్రిది హెచ్చరించారు.
