అస్సాంలో ఓట్ల సునామీ.. రికార్డ్ స్థాయిలో 85.91 శాతం పోలింగ్! వంద సీట్లపై హిమంత ధీమా.. అస్సామీ అస్తిత్వ పోరాటమే ఈ తీర్పా?

గువహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఓటర్లు పోటెత్తారు. ఏకంగా 85.91 శాతం పోలింగ్ నమోదై ప్రజాస్వామ్య పండుగలో ఒక కొత్త మైలురాయిని సృష్టించారు. ఈ భారీ పోలింగ్ వెనుక ఏదో పెద్ద మార్పు జరగబోతోందన్న సంకేతాలు వెలువడుతుండగా, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన జోస్యం చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి ఈసారి అస్సాంలో ‘సెంచరీ’ కొట్టబోతోందని, అంటే మూడు అంకెల స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హిమంత పొలిటికల్ లెక్కలు ఇవే: పోలింగ్ సరళిని గమనించిన తర్వాత సీఎం హిమంత మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు కేవలం అధికారం కోసం జరిగిన పోరాటం కాదని, అస్సాం నాగరికతను, భూమిని కాపాడుకోవడానికి జరిగిన ఒక ఉద్యమమని అభివర్ణించారు. “సాధారణంగా బంగ్లాదేశీ మూలాలున్న ముస్లింల ఓటింగ్ 95-96 శాతం ఉంటుంది, కానీ అస్సామీ సమాజం 75 శాతానికే పరిమితమయ్యేది. కానీ ఈసారి అస్సామీలు కూడా పోటీపడి ఓటేశారు. కొన్ని బూత్‌లలో మన ఓటింగ్ 95 శాతం దాటిపోయింది. ఇది ఎన్డీయే ప్రభంజనానికి నిదర్శనం” అని ఆయన విశ్లేషించారు.

మహిళా ఓటర్లదే పైచేయి! ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పురుషుల కంటే మహిళలే అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు.

  • మహిళా ఓటింగ్: 85.96%
  • పురుష ఓటింగ్: 84.80%
  • తృతీయ లింగాలు: 36.84% ఇంతటి భారీ పోలింగ్ ‘ప్రభుత్వ వ్యతిరేకతా’ లేక ‘అభివృద్ధికి మద్దతా’ అన్న చర్చ ఇప్పుడు అస్సాం గల్లీ గల్లీలో మొదలైంది.

ముస్లిం ప్రాబల్యం ఉన్న చోటా బీజేపీకి ‘జోష్’: శర్మ తన కూటమి ప్రదర్శనపై మాట్లాడుతూ.. మిత్రపక్షమైన అసోం గణ పరిషత్ (AGP) ఇప్పటికే రెండు ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల్లో గెలుపుకు చేరువలో ఉందని చెప్పారు. చొరబాటుదారులకు వ్యతిరేకంగా, అస్సాం అస్తిత్వం కోసం మహిళలు, యువత పెద్ద ఎత్తున ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు.

మే 4న అసలు సిసలైన తీర్పు: అస్సాం అసెంబ్లీ భవిష్యత్తు ఇప్పుడు ఈవీఎంలలో (EVM) నిక్షిప్తమై ఉంది. మే 4న కౌంటింగ్ జరగనుంది. హిమంత బిస్వా శర్మ చెప్పినట్లు ఎన్డీయే 100 సీట్ల మార్కును దాటుతుందా? లేక విపక్షాలు షాక్ ఇస్తాయా? అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.


Posted

in

by

Tags: