భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో అనుష్క శెట్టి ఒకరు. తరచుగా అనుష్క పెళ్లి గురించి రకరకాల పుకార్లు వినిపిస్తుంటాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఒక స్టార్ నటుడి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఈ ఇంటర్వ్యూలో అనుష్క తన సినీ ప్రవేశం గురించి పలు వివరాలను పంచుకున్నారు. తన సినిమా ప్రయాణం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ద్వారా ప్రారంభమైందని వెల్లడించారు. అనుష్కకు అత్యంత ఆప్తమిత్రుడైన ఈ. నివాస్ భార్య, ఒకసారి పూరీ జగన్నాథ్‌ను కలవమని సూచించినప్పుడు ఆమె చాలా సిగ్గుపడ్డారట. మొదట ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ఆ సమయంలో అనుష్క ముంబైలో నివసిస్తున్నారు.
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో ఆడిషన్: మరోసారి అవకాశం రావడం, చుట్టూ ఉన్నవారు ప్రోత్సహించడంతో చివరకు ఆమె పూరీ జగన్నాథ్‌ను కలిశారు. చిన్నప్పటి నుండి సినిమాలు, టీవీలు పెద్దగా చూడకుండా పెరిగిన అనుష్కకు, సినిమాల్లోకి రావాలంటే ఫోటో షూట్ పోర్ట్‌ఫోలియో ఉండాలనే విషయం కూడా తెలియదు. పూరీ జగన్నాథ్ ఫోటోలు అడిగినప్పుడు, అనుష్క తన పర్సులో ఉన్న ‘పాస్‌పోర్ట్ సైజ్’ ఫోటోను తీసి ఇచ్చారట. ఆమె అమాయకత్వాన్ని చూసి ముచ్చటపడిన పూరీ, మరుసటి రోజే హైదరాబాద్ రమ్మని చెప్పారు. అయితే యోగా తరగతుల వల్ల తాను వెంటనే రాలేనని, శుక్రవారం వస్తానని అనుష్క బదులిచ్చారు.
నాయనమ్మ నమ్మకం – నాగార్జున ప్రోత్సాహం: ఆడిషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కినేని నాగార్జున ‘మాస్’ సినిమా షూటింగ్లో ఉన్నారు. అది ఒక ఆడిషన్ అని కూడా అనుష్కకు పూర్తిగా తెలియదు. అక్కడ మేకప్ టెస్ట్ చేస్తున్నప్పుడు, తన పక్కనే ఉన్న మరో పోటీదారు మేకప్ వేసుకుని ఫోటో షూట్‌కు సిద్ధంగా ఉండటం చూసి అనుష్క ఆందోళన చెందారు. ఫోటో షూట్ సమయంలో గాలి కోసం ఫ్యాన్లు వాడటం చూసి, తనను డాన్స్ చేయమంటారేమో అని భయపడ్డారట.
అనుష్క మాట్లాడుతూ.. “నా చుట్టూ ఉన్నవారు నా అమాయకత్వాన్ని గుర్తించి, నాకు ఎంతో ఓపికగా విషయాలు వివరించారు. నాలోని ప్రతిభను గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు నటుడు నాగార్జున గారికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. ఆయన నాపై ఉంచిన నమ్మకం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. నాగార్జున గారు నా జీవితంలో ఒక ‘గాడ్ ఫాదర్’ వంటివారు. అందుకే నా హృదయంలో ఆయనకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది” అని వెల్లడించారు.
