జీ తమిళ ఛానెల్లో ప్రసారమయ్యే “తమిళా తమిళా” కార్యక్రమం గత వారం ఎపిసోడ్లో ఒక గుండెను పిండేసే నిజ జీవిత కథ వెలుగులోకి వచ్చింది. “జీవిత భాగస్వామిని కోల్పోయిన తర్వాత ఎక్కువగా కష్టపడేది పురుషులా? స్త్రీలా?” అనే అంశంపై జరిగిన చర్చలో ఒక భర్త పంచుకున్న అనుభవం అక్కడి వారినే కాకుండా, చూస్తున్న ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది.
ప్రేమ మరియు కలలు: ఆ భర్తకు మొదటి నుండి ఫోటోగ్రఫీ అంటే ప్రాణం. ఒక మంచి కెమెరా కొనుక్కుని పెద్ద ఫోటోగ్రాఫర్ కావాలనేది అతని కల. ఈ విషయాన్ని తన ప్రియురాలికి చెప్పగా, ఆమె తన వద్ద ఉన్న పొదుపు మొత్తం ఇచ్చి అతనికి కెమెరా కొనిచ్చింది. ఆ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. చిన్న చిన్న సంతోషాలు, కలిసి పనికి వెళ్లడం, ఫోటోగ్రఫీ ఆర్డర్లు తీసుకుంటూ వారి జీవితం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది అనుకున్న సమయంలో ఒక రాత్రి అంతా తలకిందులైంది.
ఘోర ప్రమాదం: ఒకరోజు అతని భార్య స్నేహితురాలి ఇంటికి వెళ్లి స్కూటర్ పై తిరిగి వస్తుండగా, మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు ఆమెను వేగంగా ఢీకొట్టింది. ఆ నలుగురు యువకులు ఒక్క క్షణంలో ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు. ఆమెను ఢీకొట్టిన తర్వాత కారు ఆపకుండా పారిపోయారు.
ఆ ప్రమాదంలో ఆమె వెన్నెముక, మెడ, పక్కటెముకలు విరిగాయి. కాళ్లు ఛిద్రమయ్యాయి. కిడ్నీ, ప్యాంక్రియాస్ దెబ్బతిన్నాయి. శరీరం నుండి రక్తం ఏరులై పారింది. చాలా సేపటి తర్వాత ఎవరో చూసి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
చివరి కోరిక: ఆసుపత్రిలో పది రోజుల పాటు మూడు పెద్ద శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రతిసారి ఆపరేషన్ తర్వాత ఆమె తన భర్తను చూసి “ఈ నొప్పి భరించలేకపోతున్నాను.. నన్ను వదిలేయండి” అని చేతులు జోడించి వేడుకునేది. ఒకరోజు ఆమె ఆసుపత్రి భోజనం తినలేక “నాకు ఇంట్లో చేసిన పప్పు అన్నం కావాలి” అని అడిగింది. భర్త వెంటనే ఇంటికి వెళ్లి పప్పు అన్నం వండి ఆసుపత్రికి బయలుదేరాడు. కానీ మార్గమధ్యంలోనే అతనికి ఫోన్ వచ్చింది.. “ఆధార్ కార్డు తీసుకుని త్వరగా రండి” అని. అప్పటికే ఆమె కన్నుమూసింది. “ఆమె కోసం తీసుకెళ్లిన భోజనం నా చేతిలో ఉంది.. కానీ నా భార్య లేదు” అని అతను ఏడుస్తూ చెప్పిన మాటలు అందరినీ కలిచివేసాయి.
నేటికీ ఆ ప్రమాదానికి సంబంధించిన కేసు నడుస్తూనే ఉంది, ఆ నలుగురికీ ఇంకా శిక్ష పడలేదు. తాత్కాలిక మద్యం మత్తు ఒక నిండు జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఈ కథ ఒక నిదర్శనం.
