దుబాయ్: అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. దీనివల్ల దుబాయ్ సహా గల్ఫ్‌లోని ప్రధాన నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం ఒక భారతీయ పారిశ్రామికవేత్త తన అపార్ట్మెంట్లో ఉచితంగా వసతి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు.
ఇరాన్ మరియు ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా, బహ్రెయిన్ వంటి పొరుగు దేశాలపై కూడా ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల వల్ల విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
భారతీయుల కోసం తలుపులు తెరిచారు
పని నిమిత్తం లేదా పర్యాటకానికి గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల అక్కడ చిక్కుకుపోయారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, మానవత్వంతో అల్ మిజాన్ గ్రూప్ చైర్మన్ యోగేష్ దోషి తన 64 అపార్ట్మెంట్లు ఉన్న పూర్తి భవనాన్ని భారతీయుల కోసం కేటాయించారు.
125 మంది భారతీయులకు ఆశ్రయం
ఈ అపార్ట్మెంట్లలో ఉండేవారికి వసతితో పాటు ఆహారం వంటి ప్రాథమిక సౌకర్యాలను కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు. ‘ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ’ మరియు దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని ఈ సేవలు అందిస్తున్నట్లు దోషి తెలిపారు. దీని ద్వారా చిన్న పిల్లలతో సహా సుమారు 125 మందికి పైగా భారతీయులకు తలదాచుకునే చోటు దొరికింది.
దుబాయ్‌లో చిక్కుకున్న మోహిత్ వాచాని, రియా మహాడియా వంటి వారు మాట్లాడుతూ.. “హోటల్ బుకింగ్ గడువు ముగిసింది, వాటిని పొడిగించే అవకాశం లేదు. ప్రయాణ మార్గాలు మూసుకుపోయాయి. అటువంటి సమయంలో ఈ వసతి మాకు పెద్ద ఊరటనిచ్చింది” అని తమ ఆవేదనను పంచుకున్నారు.
అజ్మాన్ నగరంలోనూ సహాయం
దుబాయ్ సమీపంలోని అజ్మాన్ నగరంలో కూడా మరో పారిశ్రామికవేత్త ధీరజ్ జైన్ తన విశాలమైన ఫామ్ హౌస్‌ను భారతీయుల కోసం తాత్కాలిక నివాసంగా మార్చారు. ఇంటికి వెళ్లలేక, చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఇక్కడ ఉచిత వసతి, భోజనం కల్పిస్తున్నారు. ప్రయాణికులను హోటళ్ల నుండి తీసుకురావడానికి తన 6 రోల్స్ రాయిస్ కార్లు సహా మొత్తం 11 కార్లను ఆయన ఉపయోగిస్తున్నారు.
